సభ్యుల వినతి పత్రంపై 3 వారాల్లో చర్యలు తీసుకోండి... జూబ్లీహిల్స్‌ సొసైటీ నిర్మాణాలపై జీహెచ్‌ఎంసీకి హైకోర్టు ఆదేశం

సభ్యుల వినతి పత్రంపై 3 వారాల్లో చర్యలు తీసుకోండి... జూబ్లీహిల్స్‌ సొసైటీ నిర్మాణాలపై జీహెచ్‌ఎంసీకి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ కోఆపరేటివ్‌ హౌసింగ్‌ బిల్డింగ్‌ సొసైటీలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై అందిన వినతిపత్రంపై మూడు వారాల్లోగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హైకోర్టు బుధవారం జీహెచ్‌ఎంసీని ఆదేశించింది. సొసైటీలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నాయని, దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని పేర్కొంటూ సొసైటీ సభ్యులు కె. జ్యోతిప్రసాద్, ఎం. ప్రభాకర్‌రావు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 

ఈ పిటిషన్‌ను జస్టిస్‌ ఎన్‌.వి. శ్రవణ్‌ కుమార్‌ బుధవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది టి. సృజన్‌కుమార్‌రెడ్డి కోర్టులో వాదనలు వినిపిస్తూ.. సొసైటీ ఆవరణలో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను వెంటనే తొలగించాలని తెలిపారు. 

చట్టవిరుద్ధంగా కొనసాగుతున్న రెస్టారెంట్లు, ఇతర అనధికారిక వాణిజ్య కార్యకలాపాలను తక్షణమే నిలిపివేసేలా ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. ఏప్రిల్‌ 3 నుంచి కమ్యూనిటీ సెంటర్‌లో నిర్వహించనున్న ‘ఇండియా ఆర్ట్‌ ఫెస్టివల్‌’ను నిలిపివేయాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషనర్లు సమర్పించిన వినతి పత్రాన్ని పరిశీలించి, మూడు వారాల్లోగా చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీని ఆదేశిస్తూ పిటిషన్‌పై విచారణను ముగించారు.