
హైదరాబాద్, వెలుగు: ఈడబ్ల్యూఎస్‌కు పీహెచ్‌డీ సహా అన్ని అడ్మిషన్లల్లో రిజర్వేషన్ వర్తింపజేయాలని ఉస్మానియా వర్సిటీకి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పీహెచ్‌డీ అడ్మిషన్లకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేయకపోవడాన్ని తప్పుబడుతు రంగారెడ్డి జిల్లా చింతల్‌కు చెందిన ఓ విద్యార్థిని పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్ బుధవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ లాయర్ వాదిస్తూ.. పీహెచ్‌డీ అడ్మిషన్లకు గతేడాది ఆగస్టు1న ఇచ్చిన నోటిఫికేషన్‌లో రాష్ట్ర సర్కార్ రిజర్వేషన్ పాలసీని అమలు చేస్తున్నట్లుగా ఓయూ ఆఫీసర్లు పేర్కొన్నారని చెప్పారు. ఇకపై ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ లాయర్ చెప్పడంతో.. పిటిషన్‌పై విచారణను కోర్టు ముగించింది.