
- 18వ తేదీ డెడ్లైన్.. ఆర్టీసీకి హైకోర్టు ఆదేశం
- ప్రతీ నెల కట్ చేస్తున్న డబ్బులు జమ చేయాల్సిందే
- మూడు నెలలైనా బకాయి ఎందుకు చెల్లించలేదని ఫైర్
హైదరాబాద్, వెలుగు : సీసీఎస్ (క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ)కి 18వ తేదీలోగా రూ.200 కోట్లు చెల్లించాలని ఆర్టీసీకి హైకోర్టు జడ్జి జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డి ఆదేశించారు. ప్రతీనెల ఆర్టీసీ కార్మికుల నుంచి సీసీఎస్ కోసం కట్ చేస్తున్న సుమారు రూ.18 కోట్లను కూడా ఇప్పటి నుంచి రెగ్యులర్గా చెల్లించాలన్నారు. గత డిసెంబర్ లో బకాయిలు చెల్లించేందుకు గడువు ఇస్తే ఎందుకు చెల్లించలేదని ఫైర్ అయ్యారు. నిధుల కొరత, ఆర్టీసీ నష్టాల కారణంగా 6 నెలలు టైమ్ ఇవ్వాలని గత డిసెంబర్ లో హైకోర్టును ఆర్టీసీ గడువు కోరింది.
అయితే, ఆ టైమ్ లో 3నెలలు కంప్లీట్ అయిందని, ఇప్పటిదాకా రూపాయి కూడా రిలీజ్ చేయలేదని సీసీఎస్ తరఫు అడ్వకేట్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆర్టీసీకి ప్రతీరోజు రూ.14 కోట్ల రెవెన్యూ వస్తున్నదని, బల్క్ డీజిల్లో కూడా ఖర్చు తగ్గిందని తెలిపారు. ప్రతీ రోజు కార్మికులు రిటైర్ అవుతున్నారని, అయినా బకాయిలు చెల్లించడం లేదని వివరించారు. రెండేండ్లుగా సీసీఎస్కు నిధులు ఆర్టీసీ చెల్లించడం లేదని తెలిపారు. అసలు, వడ్డీ కలిపి సుమారు రూ.950 కోట్లు బకాయి ఉన్నట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వాదనలు విన్న హైకోర్టు.. రెండు వారాల్లో రూ.200 కోట్లు సీసీఎస్కు చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.