
హైదరాబాద్, వెలుగు: హోర్డింగ్‌ల ఏర్పాటులో మున్సిపాలిటీలు లేదా మున్సిపల్ కార్పొరేషన్‌లు అనుసరిస్తున్న విధానంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ తదితరులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని స్పష్టం చేసింది. విచారణను ఆగస్టు 6కు వాయిదా వేసింది. 15 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న ఎల్‌ఈడీ హోర్డింగ్‌లను తొలగించాలన్న జీవో 68ని రద్దు చేయాలని తెలంగాణ ఔట్‌డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్‌తో సహా 53 ప్రకటన సంస్థలు పిటిషన్ దాఖలు చేశాయి.
వీటిని జస్టిస్ బి. విజయ్‌సేన్ రెడ్డి విచారించారు. ఈ అంశంపై ఎన్నిసార్లు వినతి పత్రాలు సమర్పించినా ప్రభుత్వం పరిష్కారం చూపలేదని పిటిషనర్ల తరఫు అడ్వకేట్ కోర్టుకు తెలిపారు. కొన్ని కంపెనీలకు మినహాయింపులు ఇచ్చారని వాదించారు. హోర్డింగ్‌ల విషయంలో అందరికి ఒకే అనుమతి వర్తించేలా ఆదేశించాలని కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి..విచారణను వాయిదా వేశారు.