కూల్చివేతపై ఎందుకంత తొందర?: సర్కారుకు హైకోర్టు ప్రశ్న

కూల్చివేతపై ఎందుకంత తొందర?: సర్కారుకు హైకోర్టు ప్రశ్న

సచివాలయం కూల్చివేతకు తొందరెందుకంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు తప్పుబట్టింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకూ పాత భవనాలను కూల్చొద్దని స్పష్టం చేసింది. బుధవారం హైకోర్టులో విచారణ సందర్భంగా పాత సచివాలయ కూల్చివేత, కొత్త భవనాల నిర్మాణ డిజైన్లపై న్యాయమూర్తులు ప్రశ్నించారు. గత విచారణ సందర్భంగా అడిగిన సమగ్ర నివేదికను సమర్పించకపోవడంపై ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. నూతన సచివాలయంపై కేబినెట్ ఫైనల్ నమూనా నివేదిక తీసుకుని రావాలని హైకోర్టు ఆదేశించింది. కొత్త భవనాల నిర్మాణానికి సంబంధించి కొత్త టెక్నాలజీని వినియోగించుకోవాలని నిర్ణయించామని, అయితే ఇంకా డిజైన్లు సిద్ధం కాలేదని ప్రభుత్వం తరఫు లాయర్ నివేదించారు. డిజైన్లు, సమగ్ర ప్లాన్‌పై కేబినెట్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు.

ప్రభుత్వం నుంచి వచ్చిన సమాధానంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇంకా డిజైన్లు సిద్దం కానప్పడు సచివాలయం భవనాల కూల్చివేతకు ఎందుకు తొందర పడుతున్నారని ప్రశ్నించింది. కొత్త భవనాల నిర్మాణానికి కావాల్సిన డిజైన్, ప్లాన్లను రెడీ చేయాలని ఆదేశించింది. అవసరమైన టెక్నాలజీ అందుబాటులో ఉన్నప్పుడు డిజైన్, ప్లాన్ ఇంకా రెడీ కాలేదని చెప్పడంలో అర్ధం లేదని కోర్టు అభిప్రాయపడింది. కూల్చివేతపై నిర్ణయం తీసుకున్న కేబినెట్ డిజైన్లను ఎందుకు ఖరారు చేయలేదని ప్రశ్నించింది. డిజైన్లు, ప్లాన్ల విషయంలో కేబినెట్ తుది నిర్ణయం తీసుకునే వరకు ఎలాంటి కూల్చివేతలు చేపట్టొద్దని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సమగ్ర నివేదికను అందజేయాలని ప్రభుత్వానికి సూచిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.