
ఎర్రమంజిల్, సెక్రటేరియట్ భవనాల కూల్చివేతలపై హైకోర్టులో విచారణ బుధవారానికి వాయిదాపడింది. ఈ కేసు తేలేంత వరకు భవనాలు కూల్చవద్దని మరోసారి హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వానికి తెలియజేస్తామని అడిషనల్ అడ్వకేట్ జనరల్ న్యాయమూర్తికి విన్నవించారు.
సెక్రటేరియట్, ఎర్రమంజిల్ భవనాల కూల్చివేతపై ఇవాళ ఉదయం, మధ్యాహ్నం హైకోర్టులో వాదనలు జరిగాయి. రెండు సందర్భాల్లోనూ కోర్టు .. కేసు తేలేంతవరకు కూల్చివేతలు చేయొద్దని సూచించింది.
హైదరాబాద్ లోని ప్రభుత్వ కట్టడాలపై గవర్నర్ కు నిర్ణయాధికారం ఉంటుందని కోర్ట్ కు తెలిపారు పిటిషనర్. సెక్షన్ 8 (2)(3) ప్రకారం భవనాలు, శాంతి భద్రతలపై ఉమ్మడి రాజధానిలో గవర్నర్ కే అధికారం ఉంటుంది కానీ.. ప్రభుత్వానికి కాదన్నారు పిటిషనర్. చారిత్రక, వారసత్వ, సాంస్కృతిక కట్టడాలు 100 ఏళ్ళ దాటితే వాటిని కూల్చడానికి వీల్లేదని .. 100 ఏళ్ళు దాటినా కట్టడాలను జాతీయ వారసత్వ సంపదగా పరిగణించాలని రూల్ ఉన్నట్టుగా కోర్టుకు చెప్పారు పిటిషనర్.
ఐతే… డైరెక్టరేట్ ఆర్కియాలజీ .. ఎర్రమంజిల్ ను జాతీయ సంపదగా గుర్తించిందా అని ప్రశ్నించింది హైకోర్టు. అలాంటి వివరాలు ప్రస్తుతం తమ వద్ద లేవని… తర్వాత పూర్తి వివరాలు సమర్పిస్తామని పిటిషనర్ కోర్టుకు చెప్పారు. ఈ సందర్భంలో గూగుల్ మ్యాప్ ను మరోసారి పరిశీలిచింది హైకోర్టు.
ఉమ్మడి రాష్ట్రంలో సరిపోయిన అసెంబ్లీ, సెక్రటేరియట్ భవనాలు ఇప్పుడు ఎందుకు సరిపోవడం లేదో అర్థం కావడం లేదని పిటిషనర్ కోర్టుకు చెప్పారు. ఉన్నవి కూల్చి.. కొత్త భవనాలు కట్టడం వల్ల ప్రజాధనం వేస్టవుతుందని అన్నారు. వాదనలు విన్న కోర్టు.. తర్వాత విచారణను బుధవారానికి వాయిదా వేసింది.