పాలమూరు స్పాంజ్‌‌‌‌ ఐరన్‌‌‌‌ యూనిట్లను తరలించండి

పాలమూరు స్పాంజ్‌‌‌‌ ఐరన్‌‌‌‌ యూనిట్లను తరలించండి
  • రైతులకు నష్టపరిహారం చెల్లించాల్సిందే
  • రాష్ట్రానికి హైకోర్టు ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జన నివాసాలకు దగ్గరున్న స్పాంజ్‌‌‌‌ ఐరన్‌‌‌‌ యూనిట్‌‌‌‌లను ఏడాదిలోగా తరలించాలని  ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అక్కడ ఉన్న పరిశ్రమలు పర్యావరణ చట్ట నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నాయో లేదో చెప్పాలని ఆదేశించింది.  క్షేత్రస్థాయిలో పరిశీలించి రెండు నెలల్లో రిజిస్ట్రార్‌‌‌‌కు నివేదిక ఇవ్వాలని పొల్యూషన్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ బోర్డుకు స్పష్టం చేసింది. స్పాంజ్‌‌‌‌ ఐరన్‌‌‌‌ పరిశ్రమల కాలుష్యం వల్ల పంట నష్టం జరిగిన రైతులను గుర్తించి పరిహారంగా..ఆయా కంపెనీలు డిపాజిట్‌‌‌‌ చేసిన సొమ్మును చెల్లించాలని సూచించింది.

ఉమ్మడి మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ జిల్లాలోని కోడిచర్ల, తీగాపూర్, గుండ్లపట్లపల్లి, రంగారెడ్డిగూడ అప్పాజీపల్లి తాండా గ్రామాల్లోని వ్యవసాయ క్షేత్రాల్లో స్పాంజ్‌‌‌‌ ఐరన్‌‌‌‌ పారిశ్రామిక యూనిట్ల నుంచి కాలుష్యం వెలువడుతోందంటూ 2005లో షాద్‌‌‌‌నగర్‌‌‌‌కు చెందిన టి.వీరేందర్‌‌‌‌రెడ్డి సహా 9 మంది వేసిన ప్రజాహిత వ్యాజ్యాలపై విచారణను ముగించింది. ఈ మేరకు ఇటీవల చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ అలోక్‌‌‌‌ అరాథే డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ తుది ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు పిటిషనర్ల లాయర్‌‌‌‌ వాదిస్తూ.. స్పాంజ్‌‌‌‌ ఐరన్‌‌‌‌ పరిశ్రమల కాలుష్యం వల్ల పంటలు దెబ్బతింటున్నాయని చెప్పారు.

ఈ వ్యవహారంపై పీసీబీ ఇచ్చిన నివేదికను కూడా హైకోర్టు పరిశీలించింది. నివాస ప్రాంతాలకు సమీపంలోని ఆనంద్‌‌‌‌ మెటాలిక్స్‌‌‌‌ అండ్‌‌‌‌ పవర్, సుందర్‌‌‌‌ ఇస్పాత్‌‌‌‌ లిమిటెడ్, వినాయక స్టీల్స్, రాయిటర్‌‌‌‌ మెటల్స్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఇండియా, కేడియా అల్లాయ్స్‌‌‌‌ లిమిటెడ్, సిరి శివశక్తి స్టీల్స్‌‌‌‌ అల్లాయ్స్‌‌‌‌లను మరోచోటికి తరలించాలని పీసీపీ రికమండ్‌‌‌‌ చేసింది. దీన్ని పరిశీలించిన హైకోర్టు.. ప్రజల నివాసాలకు కిలోమీటరు దూరంలోని స్పాంజ్‌‌‌‌ ఐరన్‌‌‌‌ యూనిట్‌‌‌‌లను తరలించాలని ఉత్తర్వులు జారీ చేసింది. మిగిలినవి నిబంధనల ప్రకారం నిర్వహిస్తున్నాయో లేదో క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలంటూ 19 ఏళ్ల నాటి పిటిషన్‌‌‌‌పై విచారణను ముగించింది.