హాస్టల్స్‌‌‌‌లో సౌలతులపై రిపోర్టు ఇవ్వండి: హైకోర్టు ఆదేశం

హాస్టల్స్‌‌‌‌లో సౌలతులపై రిపోర్టు ఇవ్వండి: హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్‌‌‌‌ వెల్‌‌‌‌ఫేర్‌‌‌‌ హాస్టల్స్‌‌‌‌లో  మౌలిక వసతులపై రిపోర్టు ఇవ్వాలని ప్రభుత్వాన్ని  హైకోర్టు ఆదేశించింది. స్కూల్స్‌‌‌‌, హాస్టల్స్‌‌‌‌లో కలుషిత ఆహారం తిని విద్యార్థులు ఆస్పత్రిపాలు కావడం, ఇతర అంశాలపై అక్టోబర్‌‌‌‌ 6వ తేదీలోగా నివేదిక సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ కమిషన్‌‌‌‌ నిర్దేశించిన గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌ ప్రకారం పిల్లలకు సౌకర్యాలు లేవని హైదరాబాద్‌‌‌‌కు చెందిన కె. అఖిల్‌‌‌‌ గురుతేజ దాఖలు చేసిన పిల్‌‌‌‌ను చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ అలోక్‌‌‌‌ అరాధే, జస్టిస్‌‌‌‌ ఎన్‌‌‌‌ వి. శ్రవణ్‌‌‌‌ కుమార్‌‌‌‌లతో కూడిన డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ మంగళవారం విచారించింది. 

పిటిషనర్‌‌‌‌ లాయర్‌‌‌‌ చిక్కుడు ప్రభాకర్‌‌‌‌ వాదిస్తూ.. ప్రభుత్వం తెచ్చిన విద్యాహక్కు, బాలల హక్కుల చట్టాలు, రాజ్యాంగ అధికరణాల ప్రకారం స్టూడెంట్లకు మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని చెప్పారు. నాగర్‌‌‌‌ కర్నూలు జిల్లా దేవరుప్పుల, మోర్తాడ్, మన్ననూర్‌‌‌‌లోని ఎస్సీ, ఎస్టీ, బాలికలు, బాలుర హాస్టల్స్‌‌‌‌లో కలుషిత ఆహారం వల్ల పెద్ద సంఖ్యలో విద్యార్థులు అనారోగ్యం బారినపడి ఆస్పత్రి పాలయ్యారని చెప్పారు. ఈ అంశంపై అనుబంధ పిటిషన్‌‌‌‌ దాఖలు చేసినట్లు చెప్పారు. 300 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారని వివరించారు. 

150 మందిని ఆస్పత్రికి తరలించారని అన్నారు. ఇప్పటికీ 10 నుంచి 15 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారని చెప్పారు.  సరైన అంబులెన్స్‌‌‌‌ వంటి వసతులు కూడా లేకపోవడంతో విద్యార్థులను లారీల్లో తీసుకువెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. వాదనల తర్వాత  ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు.. విచారణను వచ్చే నెల 6కి వాయిదా వేసింది.