గ్రూప్ 1 ‘కీ’లో  తప్పులున్నయ్

గ్రూప్ 1 ‘కీ’లో  తప్పులున్నయ్
  • టీజీపీఎస్సీ పట్టించుకోవడం లేదు 
  • హైకోర్టులో కొనసాగిన వాదనలు

 హైదరాబాద్, వెలుగు: గ్రూప్ 1 ప్రాథమిక కీలో తప్పులు దొర్లాయని చెప్పినా టీజీపీఎస్సీ స్పందించడం లేదంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో మంగళవారం వాదనలు కొనసాగాయి. గ్రూప్-1 పోస్టుల భర్తీ నిమిత్తం 2022లో జారీ చేసిన నోటిఫికేషన్​ను రద్దు చేయకుండా మరో నోటిఫికేషన్ జారీ చేయడం చెల్లదన్నారు. ప్రాథమిక కీలో తప్పులున్నాయని, వాటిని సవరించాలని వినతి పత్రాలు సమర్పించినా ఫలితం లేదన్నారు. పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన రెండు పిటిషన్లను జస్టిస్ ఫుల్లా కార్తీక్ విచారించారు.

పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు జి.శివ, జొన్నలగడ్డ సుధీర్ వాదించారు. గ్రూప్-1 నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ గతంలో ఇదే హైకోర్టు పరీక్షను రద్దు చేసిందని గుర్తు చేశారు. ఈ సారి నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీలో కూడా ఏడు ప్రశ్నలకు సమాధానాలు తప్పుగా ఉన్నాయన్నారు. మరో ఏడు ప్రశ్నలకు ఆన్సర్లు గందరగోళంగా ఉన్నాయని చెప్పారు. ఆ ప్రశ్నలను తొలగించి తిరిగి కీ విడుదల చేయాలని అభ్యర్థించినా పట్టించుకోలేదన్నారు. టీజీపీఎస్సీ తరఫు వాదనలు ఈ నెల మూడో తేదీన కొనసాగనున్నాయి.