ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు విచారణ రేపటికి వాయిదా

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు విచారణ రేపటికి వాయిదా

ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. కార్మికుల సమ్మె చట్ట విరుద్ధమా.. కాదా.. అని చెప్పే అధికారం హైకోర్టుకు ఉందా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ అంశంపై వివరించాలని సీనియర్‌ న్యాయవాది విద్యాసాగర్‌ను కోర్టు కోరింది. ఎస్మా కింద సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించవచ్చని తెలిపారు. ఆర్టీసీని 1998, 2015లో ఎస్మా పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. 1998లో ఇచ్చిన ఉత్తర్వులు APSRTCకి అని..TSRTCకి కాదని తెలిపింది. 2015లో ఇచ్చిన ఉత్తర్వులు 6నెలల వరకే అమల్లో ఉంటాయంది. కొంత మంది చర్చలకు పిలవాలని ఆదేశించాలని కోరుతున్నారన్న హైకోర్టు… ఆర్టీసీ యాజమాన్యం కార్మికులతో చర్చలు జరపాలని ఏ చట్టంలో ఉందని ప్రశ్నించింది. అసలు చర్చలు జరపాలని ఏ ప్రాతిపదికన ఆదేశించగలమంది. అంతేకాదు హైకోర్టు చట్టానికి అతీతం కాదని… చట్టాల పరిధి దాటి వ్యవహరించలేమంది హైకోర్టు.

మరోవైపు బస్సుల్లో అధికఛార్జీలు వసూలు చేస్తున్నారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది తెలపగా.. దానిపై వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయాలని సూచించింది. అధిక ఛార్జీల వసూలు కారణంగా సమ్మె చట్ట విరుద్ధమంటూ ప్రకటించలేమని హైకోర్టు అభిప్రాయపడింది. తర్వాత తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.