ప్రతి ఫైల్‌కు ఓ కోడ్‌.. పైసలిస్తేనే ప్రాసెస్! ఖమ్మం ఆర్టీఏ ఆఫీస్‌లో అవినీతి బట్టబయలు

ప్రతి ఫైల్‌కు ఓ కోడ్‌.. పైసలిస్తేనే ప్రాసెస్! ఖమ్మం ఆర్టీఏ ఆఫీస్‌లో అవినీతి బట్టబయలు
  • ఖమ్మం ఆర్టీఏ ఆఫీస్‌లో అవినీతి బట్టబయలు
  • ఫిర్యాదులు అందడంతో ఏసీబీ రైడ్స్  
  • అర్ధరాత్రి వరకు కొనసాగిన తనిఖీలు
  • ఆర్సీలు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లు గుర్తింపు
  • ఏజెంట్ల వద్ద రూ. 78 వేలు స్వాధీనం

ఖమ్మం/ఖమ్మం టౌన్, వెలుగు : ఏజెంట్ల నుంచి వచ్చే ప్రతి ఫైల్ కు ఒక స్పెషల్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ను బట్టీ ఆ ఫైల్ ప్రాసెస్ అవుతుంది. పైసలు ఇచ్చిన ఫైళ్లు ముందుకు కదిలితే.. లంచం అందని ఫైళ్లు పక్కన పడ్తాయి. ఇదీ ఖమ్మం జిల్లా ఆర్టీఏ ఆఫీసులో అవినీతి దందా తీరు. ఆర్టీఏ ఆఫీసులో అవినీతిపై ఏసీబీకి కంప్లయింట్లు వెళ్లడంతో ఫోకస్‌ చేసింది. శనివారం ఆకస్మిక దాడులు చేపట్టింది.  ఏసీబీ డీఎస్పీ ఏకాంబరం రమేశ్‌ ఆధ్వర్యంలో టీమ్ మధ్యాహ్నం నుంచి సోదాలు చేపట్టింది. అర్ధరాత్రి దాకా కొనసాగించింది. తనిఖీల్లో వెహికల్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లను ఏజెంట్ల వద్ద గుర్తించింది. ఏజెంట్ల నుంచి వచ్చే ప్రతి ఫైల్‌ కు ఒక స్పెషల్‌ కోడ్‌ ఉండడం చూసి ఏసీబీ ఆఫీసర్లు నివ్వెరపోయారు. 

ఏజెంట్ల కనుసన్నల్లోనే అంతా.. 

ఆర్టీఏ సర్వీస్‌లన్నీ ఆన్‌లైన్‌ లోనే జరుగుతుండగా.. ఆఫీసులో ఫైల్స్ ప్రాసెస్‌ అంతా ఏజెంట్లే చూస్తున్నారు. వారి వద్దకు వచ్చే ప్రతి ఫైల్‌పై ఒక కోడ్ నంబర్‌ వేస్తున్నారు. ఆర్టీఏ ఆఫీస్‌ ఎదుట కన్సల్టెన్సీ రూమ్‌లో ఆఫీసర్ కు చెందిన ప్రైవేట్‌ అసిస్టెంట్‌ పని చేస్తున్నారు. ఏజెంట్ల నుంచి వచ్చే ప్రతి ఫైల్‌ ముందుగా అతని వద్దకు వెళ్లిన తర్వాతే ఆఫీస్‌లోకి వెళ్తున్నట్టు ఏసీబీ గుర్తించింది. ఓ ఏజెంటును అదుపులోకి తీసుకుని రూ.78 వేలు స్వాధీనం చేసుకుంది. మరో ఏజెంట్ వద్ద భారీగా రిజిస్ట్రేషన్, డ్రైవింగ్‌ లైసెన్స్‌ కార్డులు పట్టుకుంది. వాహనాల షోరూంలకు ఏజెంట్‌గా పనిచేసే ఇంకో వ్యక్తి వద్ద రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకుంది. ఆఫీస్‌లో ఉండాల్సిన కొన్ని ఫైల్స్ ప్రైవేట్ వ్యక్తుల వద్ద ఉండడంపై ఆర్టీఏ సిబ్బందిని ఏసీబీ ఆఫీసర్లు ప్రశ్నించినట్టు, 15 మంది ఏజెంట్లను అదుపులోకి తీసుకుని, ప్రైవేట్‌ ఆఫీసుల్లో కాగితాలు, కార్డులు ఎందుకు ఉన్నాయనే కోణంలో విచారణ చేస్తున్నట్టు తెలిసింది.  

 పదేండ్ల నుంచి రేట్లు పెంచలేదని..

రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీఏ సేవలను ఆన్​లైన్​చేసింది. డ్రైవింగ్ లైసెన్స్​, కార్డు రెన్యువల్, ఆర్సీ చేంజ్    తదితర పనులకు ఆన్​ లైన్ లోనే అప్లై చేసుకోవాలి. కానీ.. ఆ ఫైల్స్ ఏజెంట్ల ద్వారా వస్తే వెంటనే క్లియర్​చేస్తున్నారని, నేరుగా తీసుకెళ్తే పట్టించుకోవడంలేదని వినియోగదారుల నుంచి ఫిర్యాదులు ఏసీబీకి వెళ్లాయి. కాగా.. ఇటీవల ఏజెంట్ల ద్వారా వచ్చే ఫైళ్లను కూడా క్లియర్​చేయకుండా ఆర్టీఏ ఆఫీసర్లు పక్కనపెట్టారని తెలిసింది.  దీంతో సదరు ఆఫీసర్ ప్రైవేట్ అసిస్టెంట్ ను ఏజెంట్లు కలవగా, ఫైల్స్ క్లియరెన్స్​కు ఇచ్చే మామూళ్లను పదేండ్ల నుంచి పెంచలేదని చెప్పాడు.  కొత్తగా పెంచిన రేట్లు ఇస్తేనే పనులవుతాయని ఆఫీసర్​చెప్పినట్టుగా ప్రైవేట్ అసిస్టెంట్ తేల్చిచెప్పాడు. గత రెండు రోజుల నుంచి కొత్తగా డబుల్ రేట్లను వసూలు చేస్తున్నట్టు వినియోగదారుల నుంచి వరుస ఫిర్యాదులు రావడంతోనే ఆకస్మిక తనిఖీలు చేపట్టామని ఏసీబీ అధికారులు తెలిపారు. 

తనిఖీల తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తాం 

ఖమ్మం ఆర్టీఏ ఆఫీసులో ఫైళ్ల తనిఖీలు అర్ధరాత్రి దాకా కొనసాగిస్తాం. ఇటీవల చాలా ఫిర్యాదులు రావడంతో ఉన్నతాధికారుల అనుమతితో ఆకస్మిక తనిఖీలు చేపట్టాం. రూ.78 వేల నగదును ఏజెంట్ల వద్ద స్వాధీనం చేసుకున్నాం. రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ కార్డుల దరఖాస్తుదారులు  ఆర్టీఏ ఆఫీస్ ఆఫీసర్లకు నేరుగా అందించాల్సి ఉంది. కానీ.. ఏజెంట్ల వద్ద ఎందుకున్నాయని ఎంక్వైరీ చేస్తున్నాం. ప్రభుత్వ ఆఫీసుల్లో అధికారులు లంచం అడిగితే టోల్ ఫ్రీ నంబర్1064 కు సమాచారం ఇవ్వాలి. కంప్లైంట్ చేసిన వారి వివరాలను కూడా గోప్యంగా ఉంచుతాం.
- రమేశ్, ఏసీబీ డీఎస్పీ