హైదరాబాద్ సిటీ, వెలుగు: అల్వాల్‌లో రోడ్డును ఆక్రమించి నిర్మించిన గోడలు, నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. మేడ్చల్మల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండలంలోని అర్వింద్ ఎన్క్లేవ్లో రోడ్డు నంబర్ 4ను ఆక్రమించి అదే మార్గంలోని ఇంటి యజమానులు నిర్మాణాలు చేపట్టారు. జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినా పరిష్కారం లభించకపోవడంతో 15 ఏండ్లుగా ఇబ్బంది పడుతున్నామని పలువురు కాలనీ వాసులు ఇటీవల హైడ్రాకు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
50 అడుగుల రహదారిలో ఆటంకాలు తొలగితే 100 మీటర్లలో ప్రధాన రోడ్డుకు చేరుకుంటామని, ఇప్పుడు కిలోమీటరు పైగా తిరిగి వెళ్లాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలతో ఆక్రమణలను అధికారులు శనివారం తొలగించారు. ఆక్రమణలు తొలగడంతో హర్ష హాస్పిటల్ లేన్‌కు సులువుగా చేరుకుంటున్నామని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తొలిగాయన్నారు.
మల్కాజిగిరి: ఆర్కే పురం చెరువు శిఖం భూమిలో ఆక్రమణలను అధికారులు శనివారం తొలగించారు. చెరువు పరిధిలోని సర్వే నంబర్ 243లో సుమారు 700 గజాల స్థలాన్ని ఓ వ్యక్తి ఆక్రమించి రేకులతో బౌండరీ నిర్మిస్తున్నట్లు స్థానికులు ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ సిబ్బంది, హైడ్రా ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలించి కూల్చివేశారు.
