
- పవర్ కమిషన్ విచారణపై కేసీఆర్‌ను ప్రశ్నించిన హైకోర్టు
- పిటిషన్ విచారణార్హతపై ముగిసిన వాదనలు
- తీర్పు రిజర్వ్.. ఎల్లుండి ఉత్తర్వులు
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం ఏర్పాటు చేసిన పవర్ కమిషన్ నిజ నిర్ధారణ చేసి నివేదిక మాత్రమే ఇస్తుందని, దానిపై అభ్యంతరం ఎందుకని పిటిషనర్ (కేసీఆర్)ను హైకోర్టు ప్రశ్నించింది. విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణాల్లో అక్రమాలను తేల్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంక్వైరీ కమిషన్ ను రద్దు చేయాలని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించాలా? లేదా? అనే అంశంపై హైకోర్టు శుక్రవారం విచారించింది. దీనిపై చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్ తో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. ‘‘విచారణ కమిషన్‌కు న్యాయపరమైన అధికారాలు లేనప్పుడు, నిజ నిర్ధారణ చేసి నివేదిక ఇస్తే తప్పేముంది? న్యాయపరమైన అధికారాలు లేనప్పుడు కమిషన్ ఏం చెబితే ఏంటి? కమిషన్ ఇచ్చే నివేదికకు కట్టుబడి ఉండాలని లేదు కదా! కమిషన్ కేవలం నిజ నిర్ధారణ నివేదిక మాత్రమే ఇస్తుంది. ఇక ఈ వ్యవహారంపై అభ్యంతరం ఏముంటుంది?” అని ప్రశ్నించింది.
పిటిషన్ కు విచారణార్హత లేదు: ఏజీ
మొదట ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గట్టిగా వాదనలు వినిపించారు. ఈ పిటిషన్ కు విచారణార్హత లేదని, కొట్టివేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. పాట్నా హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పని చేసి రిటైర్డ్ అయిన జస్టిస్ నర్సింహారెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసే పరిస్థితులు రానియ్యవద్దని కోరారు. స్పందించిన హైకోర్టు.. ‘‘జస్టిస్ నర్సింహారెడ్డికి నోటీసుల జారీ వరకు వెళ్లవద్దు. ఇరుపక్షాల వాదనల తర్వాత తగిన ఉత్తర్వులు ఇస్తాం” అని చెప్పింది. తిరిగి ఏజీ వాదనలు వినిపిస్తూ.. ‘‘కోట్ల విజయభాస్కర్ రెడ్డి వర్సెస్ ఏపీ ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు తీర్పును పిటిషనర్ ఉదహరించారు. ఆ తీర్పు ప్రకారం పిటిషన్‌ను కొట్టివేయవచ్చు. కమిషన్ విచారణ నివేదిక మాత్రమే ఇస్తుంది. న్యాయపరమైన ప్రక్రియ చేపట్టదు” అని గుర్తు చేశారు. జస్టిస్ నర్సింహా రెడ్డి మీడియా సమావేశం పెట్టడంపై హైకోర్టు వివరణ కోరగా.. ‘‘ఫలానా వాళ్లు తప్పు చేశారని జస్టిస్ నర్సింహారెడ్డి చెప్పలేదు. ‘బీహెచ్‌ఈఎల్‌కు కాంట్రాక్టు ఇచ్చారు. టెండర్ విధానాన్ని అమలు చేయలేదు’ అని మాత్రమే జస్టిస్ నర్సింహారెడ్డి చెప్పారు. ఈ విషయాలు చెప్పడంలో తప్పేముంది? ఇవన్నీ రికార్డుల్లో ఉన్న వాస్తవాలే. పిటిషనర్‌కు వ్యతిరేకంగా ఏం మాట్లాడలేదు. పిటిషనర్‌కు 8బి నోటీసు జారీ చేయడం కరెక్టే. కమిషన్‌పై నిరాధార ఆరోపణలు చేసి విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నాలను అడ్డుకోవాలి” అని కోరారు. విద్యుత్ అంశాలపై విచారణకు సిద్ధమేనని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఇటీవల అసెంబ్లీలో చెప్పారని గుర్తు చేశారు.
కమిషన్ ఏర్పాటు చట్ట విరుద్ధం: పిటిషనర్
కమిషన్ ఏర్పాటు చట్ట విరుద్ధమని పిటిషనర్ తరఫు లాయర్ ఆదిత్య సోంధీ అన్నారు. ‘‘పిటిషనర్‌కు కమిషన్ నోటీసులు ఇచ్చింది. కానీ పిటిషనర్ విచారణకు హాజరు కావడానికి ముందే జస్టిస్ నర్సింహారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. పవర్ ప్లాంట్ల నిర్మాణంతో ప్రభుత్వానికి రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు నష్టం వచ్చిందని అందులో చెప్పారు. దీన్ని బట్టి కమిషన్ తుది నివేదిక ఏ విధంగా ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ మార్చి 14న జీవో 9 జారీ చేశారు. అందులో కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీ యాక్ట్ -1952 ప్రకారం జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు ఉంది. కానీ ఆ చట్ట ప్రకారం ప్రభుత్వం జ్యుడీషియల్ కమిషన్‌ను నియమించేందుకు వీల్లేదు’’ అని వాదించారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని కోరారు. కాగా, వాదనలు విన్న కోర్టు.. ఇరుపక్షాలు ప్రస్తావించిన తీర్పుల కాపీలను తమకు అందజేయాలని ఆదేశించింది. పిటిషన్‌ను విచారణకు అనుమతించాలో? లేదో? అనే అంశంపై తీర్పును రిజర్వ్ చేసింది. సోమవారం తీర్పు వెలువరిస్తామని తెలిపింది.