జర్మనీ పాస్ పోర్టుపై విదేశీ టూర్ ఎలా వెళ్లారు?

జర్మనీ పాస్ పోర్టుపై విదేశీ టూర్ ఎలా వెళ్లారు?

హైదరాబాద్‌‌, వెలుగు: జర్మనీ సిటిజన్ షిప్ ను వదిలేసుకుని ఉంటే, ఆ దేశ పాస్​పోర్టుపై విదేశీ పర్యటన ఎలా చేస్తారని వేములవాడ టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ ను హైకోర్టు ప్రశ్నించింది. జర్మనీ సిటిజన్ షిప్ లేదని నిరూపణ చేసుకోవాలని, ఈ మేరకు ఆ దేశం అధికారికంగా ఇచ్చిన డాక్యుమెంట్​ను అందజేయాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్​ అభినంద్ ​కుమార్​ షావిలీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రమేశ్ బాబుకు జర్మనీ సిటిజన్‌‌షిప్‌‌ ఉన్నందున ఆయన భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ గతంలో కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో రమేశ్ వేములవాడ నుంచి ఎమ్మెల్యే గా ఎన్నిక కావడం చెల్లదంటూ ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన ఆది శ్రీనివాస్‌ హైకోర్టును ఆశ్రయించారు.

ఈ వ్యవహారంలో రమేశ్ బాబు హైకోర్టు నుంచి స్టే పొందుతూ వస్తున్నారు. దీనిపై సోమవారం మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ తరఫున అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఎన్‌‌.రాజేశ్వర్‌ రావు వాదించారు.రమేశ్ బాబుకు జర్మనీ సిటిజన్ షిప్ ఉందని, గతేడాది డిసెంబర్‌ 16 వరకు కూడా ఆయన జర్మనీ పాస్‌ పోర్టుపైనే చెన్నై నుంచి ఆ దేశానికి వెళ్లారని కోర్టుకు తెలిపారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. జర్మనీ సిటిజన్‌‌షిప్‌‌ను వదిలేసుకుంటే ఆ దేశ పాస్‌ పోర్టుమీదనే విదేశీ పర్యటన ఎలా చేస్తారని ప్రశ్నించారు.రమేశ్ బాబు జర్మనీ సిటిజన్ షిప్ ను వదులుకున్నట్టు చెప్పుకొంటే సరిపోదని, చట్టప్రకారం అందుకు సంబంధించిన ఆధారాలను తమకు అందజేయాలని ఆదేశించారు. జర్మనీ పాస్‌ పోర్టు ఉంటే అదే దేశం నుంచి వీసా పొందాలని, అంటే రెండు దేశాల పాస్‌ పోర్టులు ఉన్నట్టుగా అర్థమవుతోందని కామెంట్​ చేశారు. విచారణను ఈ నెల 24కి వాయిదా వేశారు.