
- అది ఆమోదం పొందాకే ఎన్నికలకు వెళ్లొచ్చు కదా?
- బీసీ రిజర్వేషన్ ఉత్తర్వులపై ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న
- జీవో 9ని సవాల్ చేస్తూ వేసిన హౌస్ మోషన్ పిటిషన్లపై డివిజన్ బెంచ్ విచారణ
- గవర్నర్ ఆమోదంతో సంబంధం లేకుండా రిజర్వేషన్లు పెంచే అధికారం ప్రభుత్వానికి ఉందన్న ఏజీ
- మొత్తం రిజర్వేషన్లు 50% మించరాదని సుప్రీంకోర్టు చెప్పిందన్న ధర్మాసనం
- చట్ట సవరణ లేకుండా ఎలా ముందుకెళ్తారని ప్రశ్న
- సింగిల్ జడ్జి ఉత్తర్వులపై గడువు పెంచాలని కోరవచ్చు కదా? అని వ్యాఖ్య
- ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి నోటీసులు.. విచారణ అక్టోబర్ 8కి వాయిదా
- ఆలోగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా పిటిషన్లను విచారిస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో ఇచ్చిన తీరుపై రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. మొత్తం రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేస్తూ పంచాయతీ రాజ్ చట్టానికి సవరణ చేసిన ప్రభుత్వం.. ఆ బిల్లును గవర్నర్‌కు పంపిందని, గవర్నర్ వద్ద అది పెండింగ్‌లో ఉండగానే జీవో ఎలా తీసుకువస్తారని అడిగింది. ‘‘పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285(ఏ)కు ప్రభుత్వం చేసిన సవరణను గవర్నర్ఆమోదించిన తర్వాతే జీవోను అమలు చేయవచ్చు. రిజర్వేషన్లను ఎవరూ వ్యతిరేకించడంలేదు. కానీ ఆ ప్రక్రియ చట్టప్రకారం జరగాలని మాత్రమే చెప్తున్నాం’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం శుక్రవారం తీసుకువచ్చిన జీవో 9ను సవాలు చేస్తూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవాపురానికి చెందిన బుట్టెంగారి మాధవరెడ్డి, నల్గొండ జిల్లా చింతపల్లికి చెందిన గోరటి వెంకటేశ్ వేర్వేరుగా హౌస్‌మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డిల బెంచ్ శనివారం సాయంత్రం 5 గంటలకు విచారణ చేపట్టింది. ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను అక్టోబరు 8కి వాయిదా వేసింది. ఈలోగా ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసినా ఈ పిటిషన్లకు విచారణ అర్హత ఉంటుందని, జీవో చట్టబద్ధతను తేలుస్తామని హైకోర్టు చెప్పింది.
జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కల్పించారా?
అంతకుముందు జీవో గెజిట్ నోటిఫికేషన్‌పై ఆరా తీసిన ధర్మాసనం.. గెజిట్ రాకపోతే ఇప్పుడే విచారించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. కానీ, పిటిషనర్ల తరఫున న్యాయవాదులు బి.మయూర్‌రెడ్డి, జె.ప్రభాకర్ తమ వాదనలు వినిపిస్తూ.. బీసీలకు 25 నుంచి 42 శాతం పెంచుతూ ప్రభుత్వం హడావుడిగా జీవో తీసుకొచ్చిందన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కల్పించారా? అని ప్రశ్నించింది. సర్పంచ్ ఓసీ అయినా, బీసీ అయినా విధులు మాత్రం ఒకటే కదా, అందులోనూ వీరిని ప్రజలు పార్టీలకతీతంగా ఎన్నుకుంటున్నపుడు రిజర్వేషన్ల సమస్య ఏమిటని అడిగింది.
పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదిస్తూ.. ప్రస్తుతం బీసీలకు ఇచ్చే 42 శాతం, ఇప్పటికే ఎస్సీ, ఎస్టీలకు అమలవుతున్న 15, 10 శాతంతో కలిపి రిజర్వేషన్లు 67 శాతానికి చేరుతాయని, ఇది పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285(ఏ)కు విరుద్ధమన్నారు. వర్టికల్ రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదంటూ కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. తమిళనాడులో 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉన్నాయి కదా? అని గుర్తుచేసింది. పిటిషనర్ల న్యాయవాదులు స్పందిస్తూ 9వ షెడ్యూల్లో చేర్చడం వల్ల వాటిని సవాల్ చేసే అవకాశం లేదని, ప్రస్తుతం ఈ వివాదం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాన్ని కోర్టు కొట్టివేసిందన్నారు.
నవంబర్లో ఎన్నికలకు వెళ్లొచ్చు కదా?
బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉండగా, జీవోను ఎలా తీసుకొచ్చారని హైకోర్టు మరోసారి ప్రశ్నించగా.. ఏజీ ఎ.సుదర్శన్‌రెడ్డి సమాధానమిచ్చారు. బలహీనవర్గాల సంక్షేమం కోసం ఓ జీవో తీసుకువస్తే ఇంత హడావుడిగా హౌస్ మోషన్ పిటిషన్లు వేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. దసరా సెలవుల తర్వాత విచారణ చేపట్టాలని కోరగా, ధర్మాసనం స్పందిస్తూ.. ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయబోమని ప్రభుత్వం తరఫున హామీ ఇవ్వాలని సూచించింది. ఇంత హడావుడిగా ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వుల (సెప్టెంబర్ 30లోగా స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలన్న ఆదేశాల)పై గడువు పెంచాలని కోరవచ్చు కదా? అని అడిగింది. మరో 2 నెలల గడువు తీసుకుంటే ఈలోగా గవర్నర్ వద్ద ఉన్న బిల్లు విషయం తేలుతుందని, అప్పుడు నవంబర్ లేదా డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించుకోవచ్చు కదా? అని పేర్కొంది.
నోటిఫికేషన్ జారీ అయితే కోర్టులు జోక్యం చేసుకోజాలవని, కానీ పేరెంట్ లెజిస్లేషన్ గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉండగా సబార్డినేట్ లెజిస్లేషన్ చెల్లదని తెలిపింది. ఎన్నికలను వాయిదా వేస్తామని హామీ ఇస్తే జీవోలో జోక్యం చేసుకోబోమని ధర్మాసం చెప్పగా.. అధికారుల వివరణ లేకుండా హామీ ఇవ్వలేనని, రెండ్రోజులు గడువిస్తే చెప్తానని ఏజీ పేర్కొన్నారు. దీంతో అధికరణ 200ను ఎలా అధిగమిస్తారో చెప్పాలని కోర్టు ప్రశ్నించింది. బిల్లు పెండింగ్ ఉంటే ముందుకు వెళ్లవచ్చనడానికి గతంలో ఏవైనా తీర్పులుంటే చెప్పాలంది. 50 శాతానికి రిజర్వేషన్లపై రాజ్యాంగ పరిమితి ఉందని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు తేల్చిచెప్పిందని ధర్మాసనం పేర్కొంది. చట్ట సవరణ లేకుండా ముందుకెళ్లలేరని తెలిపింది.
ప్రభుత్వానికి ఆ అధికారం ఉంది: ఏజీ
వెనుకబడిన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందుకు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 25 శాతం నుంచి 42 శాతానికి పెంచే అధికారం రాష్ట్ర సర్కారుకు ఉందని ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదించారు. ఈ అధికారాన్ని ఎవరూ ప్రశ్నించలేరన్నారు. రిజర్వేషన్ల సవరణ బిల్లును అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిందని గుర్తుచేశారు. గవర్నర్ ఆమోదించినా, ఆమోదించకున్నా.. బీసీ రిజర్వేషన్లపై ముందుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇలాంటి పిటిషన్లపై ఇప్పటికిప్పుడే తేల్చాల్సిన అవసరంలేదని పేర్కొన్నారు. విచారణను దసరా సెలవుల తర్వాత వాయిదా వేయాలని, అప్పుడు పూర్తి వివరాలతో వాదనలు వినిపిస్తామన్నారు. ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమైతే నోటిఫికేషన్ వచ్చినా విచారణ చేపట్టవచ్చని తెలిపారు. ఎన్నికలు వారంలోగా నిర్వహించలేమన్న విషయాన్ని గుర్తించాలన్నారు. ప్రభుత్వం ఆమోదించినా నోటిఫికేషన్ ఇవ్వడానికి 45 రోజులుంటుందని తెలిపారు.
స్టే ఇవ్వండి: పిటిషనర్లు
పిటిషన్లలో కోరినట్లు జీవో 9 అమలును నిలిపివేస్తూ స్టే ఇవ్వాలని పిటిషనర్ల లాయర్లు కోరారు. గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్‌లో ఉండగా అదే అంశంపై జీవో ఇవ్వడానికి వీల్లేదన్నారు. అందువల్ల జీవోకు చట్టబద్ధత లేదని, దీన్ని చట్ట ఉల్లంఘనగా ప్రకటించాలని కోరారు. పంచాయతీ చట్ట సవరణ బిల్లును గవర్నర్‌కు పంపి నెల రోజులు కూడా కాలేదన్నారు. గత నెల 31న అసెంబ్లీ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ వస్తే కోర్టుల జోక్యానికి వీలుండదని, కాబట్టి వెంటనే జీవోపై స్టే ఇవ్వాలని వారు బెంచ్‌కు విజ్ఞప్తి చేశారు.
నోటిఫికేషన్ జారీ అయినా.. పిటిషన్లపై విచారిస్తం
అన్నిపక్షాల వాదనలను విన్న ధర్మాసనం విచారణను దసరా సెలవుల తర్వాత చేపట్టేలా వాయిదా వేస్తామని, కానీ అప్పటివరకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయబోమని హామీ ఇవ్వాలని ఏజీని అడిగింది. దీనికి ప్రభుత్వ వివరణ తీసుకుని చెప్పాలని, లేదంటే జీవో అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామంది. ఏజీ 15 నిమిషాల సమయం తీసుకొని.. అధికారులు అందుబాటులోకి రాలేదని, రెండు రోజులు గడువు కావాలని కోరారు. వారంలో ఎన్నికల ప్రక్రియ ఏమీ పూర్తికాదనగా.. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, బీసీ సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, సాధారణ పరిపాలన శాఖ, న్యాయశాఖ ముఖ్యకార్యదర్శులకు, రాష్ట్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేస్తూ విచారణను అక్టోబర్ 8కి వాయిదా వేసింది. ఈలోగా ఒకవేళ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయినా ఈ పిటిషన్లకు విచారణార్హత ఉంటుందని, వీటిలో లేవనెత్తిన అంశాలను తేలుస్తామని హైకోర్టు పేర్కొంది.
ఎన్నికల నిర్వహణకు రెడీగా ఉన్నం: రాష్ట్ర ఎన్నికల సంఘం
రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది జి.విద్యాసాగర్ వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సిద్ధంగా ఉందని, ప్రభుత్వం నుంచి ఆమోదం వస్తే ముందుకెళ్తామన్నారు. ప్రభుత్వం ఆమోదం చెప్పకుండా ఏమీ చేయలేమని తెలిపారు. 2019లో ఎన్నికలు నిర్వహించామని, పాలకవర్గాల గడువు ముగిసిపోయిందన్నారు.