
- మీకో లెక్క.. వాళ్లకో లెక్కనా?
- ధర్నాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
- వెయ్యి మందినే కంట్రోల్ చేయకపోతే రాష్ట్రాన్ని ఎట్ల కంట్రోల్ చేస్తరని ప్రశ్న
- కేంద్రానికి వ్యతిరేకంగా ధర్నాచౌక్‌లో బీఆర్ఎస్ ధర్నా చేయలేదా?
- అప్పుడు లా అండ్ ఆర్డర్ సమస్య రాలేదా?.. బీజేపీ చేస్తేనే వస్తుందా?
- ధర్నాచౌక్‌లో బీజేపీ ధర్నాకు పర్మిషన్ ఇవ్వాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద బీజేపీ ధర్నాకు రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ధర్నాకు వెయ్యి మంది వరకు వచ్చే అవకాశం ఉందని, దీంతో లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే అవకాశం ఉందని సర్కార్ చెప్పడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘వెయ్యి మంది వస్తే అదుపు చేయలేని దుస్థితిలో పోలీసులు ఉన్నరా? పోలీసులకు సమర్థత లేదా? వెయ్యి మందినే కంట్రోల్ చేయకపోతే రాష్ట్రాన్ని ఎట్ల కంట్రోల్ చేస్తరు?” అని హైకోర్టు ప్రశ్నించింది.
ఇందిరాపార్క్ వద్ద ధర్నాకు వచ్చే ఆ వెయ్యి మంది సెక్రటేరియెట్‌ను ముట్టడించే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం చెప్పింది. దీనిపై హైకోర్టు స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్వంటి పార్టీలు అదే ధర్నాచౌక్ వద్ద ధర్నా చేస్తే లా అండ్ ఆర్డర్ సమస్య రాలేదా? అని ప్రశ్నించింది. బీజేపీ ధర్నా చేస్తేనే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందా? అని నిలదీసింది. ధర్నాచౌక్ వద్ద తమ ధర్నాకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ బీజేపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ జి. ప్రదీప్ కుమార్ దాఖలు చేసిన అత్యవసర లంచ్‌మోషన్ పిటిషన్‌ను జస్టిస్ సి.వి.భాస్కర్ రెడ్డి ధర్మాసనం సోమవారం విచారించింది.
ట్రాఫిక్ సమస్య వస్తుందన్న ప్రభుత్వం
పిటిషనర్ తరఫు లాయర్ వాదిస్తూ.. ఈ నెల 14న, మళ్లీ 20న అప్లికేషన్స్ పెట్టుకుంటే పోలీసులు ధర్నాకు పర్మిషన్ ఇవ్వలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. అప్లికేషన్లను పోలీసులు తిరస్కరించారని తెలిపారు. ధర్నాను వెయ్యి మందితో నిర్వహించాలని పార్టీ భావించిందన్నారు. ధర్నాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి ఇతర నేతలు పాల్గొంటారని వివరించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తరఫు లాయర్ ఎం.రూపేందర్ స్పందిస్తూ.. వెయ్యి మందితో ధర్నాకు అనుమతిస్తే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని చెప్పారు. శాంతి భద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉంటుందన్నారు. ధర్నా చౌక్‌కు సమీపంలో కొత్తగా బ్రిడ్జి నిర్మాణం జరుగుతున్నదని, ధర్నా వల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తి ప్రజలు ఇబ్బందులకు గురవుతారని చెప్పారు. ఈ వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది.
బీఆర్ఎస్కు ఇచ్చి బీజేపీకి ఇవ్వకపోవడమేంది?
బీఆర్ఎస్ వంటి పార్టీల ధర్నాలకు అనుమతిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ చేపట్టే ధర్నాకు ఎందుకు పర్మిషన్ ఇవ్వడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. దీని వెనుకు ఉన్న ఆంతర్యమేమిటని నిలదీసింది. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పింది. ప్రజాస్వామ్యంలో ధర్నాలు, ర్యాలీలు చేసే హక్కు ప్రజలకు ఉందని గుర్తు చేసింది. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ధర్నాలు జరిగాయని, ఉద్యమం వల్లే తెలంగాణ వచ్చిందనే విషయం గుర్తుంచుకోవాలంది. ఇప్పుడు ధర్నాలు చేస్తే శాంతిభద్రతల సమస్య అంటే ఎట్లని ప్రశ్నించింది. సెక్రటేరియట్‌ను ముట్టడించే అవకాశాలున్నాయని ప్రభుత్వం చెప్పడం సరికాదని తెలిపింది. ధర్నా చౌక్‌లో నిరసన వ్యక్తం చేసే అవకాశం ఇవ్వకవపోడం ఏమిటని ప్రశ్నించింది. 500 మందితో బీజేపీ ధర్నాకు అనుమతించాలని సిటీ పోలీస్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. వారి వివరాలను కమిషనర్‌కు అందజేయాలని పిటిషనర్‌కు తెలిపింది. ర్యాలీ నిర్వహించరాదని, శాంతిభద్రతలను కాపాడాలని, ధర్నాలో 500 మంది పాల్గొని ధర్నా సాయంత్రం 6 గంటలలోపు ముగించాలని, ఈ మేరకు పోలీసులకు వివరాలు అందజేయాలని బీజేపీని ఆదేశించింది.
వర్షాలతో నేటి బీజేపీ ధర్నా వాయిదా
డబుల్ బెడ్రూం ఇండ్లను అర్హులైన పేదలందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద బీజేపీ ఆధ్వర్యంలో జరగాల్సిన ధర్నా కార్యక్రమాన్ని ఆ పార్టీ వాయిదా వేసింది. మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో ధర్నాను వాయిదా వేసుకుంది. మళ్లీ ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటించనుంది. కాగా, సోమవారం డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ క్యాడర్ చేసిన ధర్నాలు పూర్తి స్థాయిలో విజయవంతం అయ్యాయని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.