
హైదరాబాద్, వెలుగు: సెక్రటేరియట్ బిల్డింగ్స్ కూల్చివేస్తుంటే అక్కడికి వెళ్లి ఏం చేస్తారని కాంగ్రెస్ నేతలను హైకోర్టు ప్రశ్నించింది. ఆ ఏరియాలో గుప్తనిధులు ఉన్నాయని చెప్పడానికి ఆధారాలు ఏమున్నాయో చూపించాలని కోరింది. సెక్రటేరియట్ బిల్డింగ్స్ కూల్చివేత పనులను పరిశీలించేందుకు అనుమతివ్వాలని కాంగ్రెస్ నేతలు ప్రభుత్వాన్ని కోరినప్పటికీ అనుమతి ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ మాజీ మంత్రి మహ్మద్ షబ్బీర్ అలీ, ఎంపీ రేవంత్‌రెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి హైకోర్టులో రిట్ పిటిషన్‌దాఖలు చేశారు. సెక్రటేరియట్‌లోని జీ బ్లాక్ కింద గుప్త నిధులు ఉండవచ్చని, కూల్చి వేతలు జరిగే సమయంలో తమను అనుమతించలేదని పిటిషన్‌లో తెలిపారు. అక్కడి మసీదును, నల్ల పోచమ్మ టెంపుల్ కూల్చేసిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు అనుమతి ఇచ్చేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలని,శుక్రవారం లంచ్ మోషన్ లో రిట్ పిటిషన్ ను విచారించాలని కోరారు. ఐతే అత్యవసరంగా దీన్ని విచారించాల్సిన అవసరం లేదని, రిట్ పిటిషన్ ను సీరియల్ నంబర్ ఆధారంగానే విచారిస్తామని చీఫ్ జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ బి. విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ ప్రకటించింది. 95 శాతం కూల్చివేతలు పూర్తయ్యాకా అక్కడకు వెళ్లి ఏం చూస్తారని ప్రశ్నించింది. ఈ పిటిషన్ ఎల్లుండి విచారణకు వచ్చే
అవకాశం ఉంది.
For More News..