- ట్రాఫిక్ చలానా వ్యవస్థ వివరాలివ్వాలని సర్కారుకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: చలానాలు విధించి తర్వాత రాయితీలు ఇస్తే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినవారికి చట్టం పట్ల భయం ఎక్కడుంటుందని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఇది ట్రాఫిక్ క్రమశిక్షణా రాహిత్యాన్ని మరింత పెంచుతుందని వ్యాఖ్యానించింది. వాహనదారులు ఏ నిబంధన ఉల్లంఘించారో చలానాల్లో స్పష్టంగా వెల్లడించాలని..అలాగే, ఇంటిగ్రేటెడ్ ఈ-చలానా వ్యవస్థ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
విచారణను డిసెంబర్ 9కి వాయిదా వేసింది. ఇంటిగ్రేటెడ్ ఈ-చలానా వ్యవస్థను సవాల్ చేస్తూ హైదరాబాద్ తార్నాకకు చెందిన వి. రాఘవేంద్రాచారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని జస్టిస్ ఎన్.వి. శ్రవణ్‌కుమార్ విచారించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ..ట్రిపుల్ రైడింగ్‌కు 1988 మోటారు వాహనాల చట్టం సెక్షన్ 128 రెడ్‌విత్ 177 ప్రకారం.. రూ.100 నుంచి 300 మాత్రమే జరిమానా విధించాలి. కానీ, దీనికి విరుద్ధంగా 2019 నిబంధనల ప్రకారం.. రూ.1000 విధిస్తున్నారని అన్నారు.
ఇది చెల్లదని వాదించారు. ప్రభుత్వ న్యాయవాది వాదిస్తూ..మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 200 కింద ట్రాఫిక్ ఉల్లంఘనలనేవి జరిమానా విధించదగ్గ నేరాలని తెలిపారు. అందుకు సంబంధించిన జరిమానాల వివరాలను వెల్లడిస్తూ ప్రభుత్వం 2007 జీవో 54 జారీ చేసిందన్నారు.
హైకోర్టు సూచనల మేరకు ప్రభుత్వం జరిమానాను పెంచుతూ 2011లో ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ప్రస్తుత చలానా వ్యవస్థలో నిబంధనలన్నీ పొందుపరచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. చట్టానుసారం చలానా జారీ చేస్తే ఉల్లంఘన నిబంధనలు స్పష్టంగా వివరించాలన్నారు. ప్రస్తుత వ్యవస్థలో లోపాలను సరిచేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏ దశలో ఉన్నాయో వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించి, విచారణను వాయిదా వేశారు.
