ప్ర‌భుత్వం మీడియాను ఎందుకు అనుమ‌తించ‌డం లేదు: హైకోర్టు

ప్ర‌భుత్వం మీడియాను ఎందుకు అనుమ‌తించ‌డం లేదు:  హైకోర్టు

స‌చివాల‌య భవనాల కూల్చివేత పనులను కవర్‌ చేయడానికి మీడియాకు అనుమతి ఇవ్వాలంటూ దాఖ‌లైన రిట్ పిటిష‌న్ పై తెలంగాణ హైకోర్టు బుధ‌వారం విచార‌ణ జ‌రిపింది. విల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్(Vil Media Private Limited) దాఖలు చేసిన ఈ పిటిషన్ లో.. సచివాలయం కూల్చివేత కవరేజీపై ప్ర‌భుత్వం ఆంక్షలు విధించింద‌ని, భవనాల కూల్చివేతలో ప్రభుత్వం గోప్యత పాటిస్తుందని పేర్కొంది. ప్రజలకు అసలు ఏం జరుగుతుందో తెలియాల్సిన అవసరం ఉందని, ప్రసార మాధ్యమాల ద్వారా వారికి తెలిసే ప్రయత్నం చేస్తున్నామని పిటీషనర్ కోర్టుకు తెలిపారు.

దీనిపై విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు… ప్రభుత్వం మీడియాను ఎందుకు అనుమతించ‌డం లేదని ప్ర‌శ్నించగా… కూల్చివేతల సందర్భంగా సచివాలయ పరిసర ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకున్నామని, కూల్చివేతల వద్ద ప్రమాదాలు వాటిల్లుతుందన్న కార‌ణంతో ఎవ్వరికి అనుమతి ఇవ్వడం లేదన్న ప్ర‌భుత్వ త‌ర‌పు న్యాయ‌వాది స‌మాధాన‌మిచ్చారు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్చ ని కాపాడాల్సిన బాధ్యత మనందరిదని, యుద్ద రంగంలోకి కూడా మీడియాకి అనుమతిస్తున్నారని.. కూల్చివేత‌పై ఆంక్ష‌లు ఎందుక‌ని ప్ర‌శ్నించింది. పత్రికలు, చానళ్ళు లేని ప్రజాస్వామ్యాన్ని ఉహించుకోలేమని కోర్టు ఈ సంద‌ర్భంగా తెలిపింది.

మీడియా కవరేజీకి పర్మిషన్ ఇవ్వడం కుదరదని, క‌వరేజీకి అనుమతిస్తే సిటిజన్ల క్యూరియాసిటి ఉంటుందని ఏజీ తెలుప‌గా  ప్రభుత్వమే వీడియోలు, ఫోటోలు తీసి పంపించడం సాధ్యం కాదా అని కోర్టు ప్ర‌శ్నించింది.‌ అందుకు.. ప్రభుత్వాన్ని సంప్రదించి గురువారం తమ నిర్ణయం చెపుతామని అడ్వొకేట్ జనరల్ తెలిపారు. దీంతో రేపు మీడియా కవరేజీ విషయంలో వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు సూచించింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది.

High Court questions TS  government  why does not allow media in demolition of secretariat buildings