
- ప్రభుత్వ వాదనలు వినకుండా ఇవ్వలేమని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక‌్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఏర్పాటు జీవో 99 అమలును నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. జీవోపై రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినకుండా స్టే ఇవ్వలేమని తేల్చి చెప్పింది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం అలియాపూర్ గ్రామంలోని సర్వే నంబర్ 119/21, 22లో ఉన్న తమ నిర్మాణాలను కూలగొట్టడాన్ని సవాలు చేస్తూ డి.లక్ష్మి హైకోర్టులో పిటిషన్వేశారు.
మంగళవారం ఈ పిటిషన్ ను జస్టిస్ కె.లక్ష్మణ్ విచారించారు. పిటిషనర్ తరఫు లాయర్వాదనలు వినిపిస్తూ.. హైడ్రా ఏర్పాటు జీవో 99కి ఎలాంటి చట్టబద్ధత లేదని తెలిపారు. నోడల్ ఏజెన్సీ అయిన హైడ్రా విశేషమైన అధికారాలు చెలాయించడం చెల్లదని చెప్పారు. జీవోలోని నిబంధనలను ఉల్లంఘించేలా అధికారులు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా పట్టా భూముల్లోని నిర్మాణాలను కూల్చడం అన్యాయమన్నారు.
జీవోపై స్టే ఇవ్వాలని కోరారు. అయితే, ప్రభుత్వ వాదనలు విన్న తర్వాత మధ్యంతర ఉత్తర్వుల అంశాన్ని పరిశీలిస్తామని జడ్జి స్పష్టం చేశారు. తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేశారు. ఈలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు.