మనుషుల ప్రాణాలు పోతే ఎవరిది బాధ్యత?..సర్వీస్‌‌‌‌‌‌‌‌ ప్రొవైడర్లపై హైకోర్టు ఆగ్రహం

మనుషుల ప్రాణాలు పోతే ఎవరిది బాధ్యత?..సర్వీస్‌‌‌‌‌‌‌‌ ప్రొవైడర్లపై హైకోర్టు ఆగ్రహం
  • కేబుళ్లు పునరుద్ధరించాలన్న పిటిషన్‌‌‌‌‌‌‌‌ను తోసిపుచ్చిన కోర్టు
  • రామంతాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఘటనలో టీజీపీసీఎల్‌‌‌‌‌‌‌‌, ప్రభుత్వానికి నోటీసులు

హైదరాబాద్, వెలుగు: రామంతాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కరెంట్‌‌‌‌‌‌‌‌ షాక్‌‌‌‌‌‌‌‌ ఘటనపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. కేబుళ్ల పునరుద్ధరణకు అనుమతించాలన్న సర్వీసు ప్రొవైడర్ల అభ్యర్థనపై.. మనుషుల ప్రాణాల పట్ల సామాజిక బాధ్యత లేదా అని ప్రశ్నించింది. మనుషుల ప్రాణాలకు బాధ్యత ఎవరు తీసుకుంటారని నిలదీసింది.  మనుషులే లేకపోతే కేబుళ్లు, ఇంటర్నెట్‌‌‌‌‌‌‌‌ ఎందుకని అడిగింది. ప్రజల ప్రాణాలపట్ల కనికరం చూపాలని వ్యాఖ్యానించింది.

 విద్యుత్‌‌‌‌‌‌‌‌ షాక్ తగిలి ఆరుగురు మృతి చెందారని, కాస్త మానవత్వం చూపాలని హితవు పలికింది. దీనికి ఏ ఒక్కరో బాధ్యులు కాదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సర్వీసు ప్రొవైడర్లు, జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌ అందరూ బాధ్యులేనని వ్యాఖ్యానించింది. విద్యుత్‌‌‌‌‌‌‌‌ స్తంభాలకు ఉన్న వైర్ల తొలగింపుపై వివరణ ఇవ్వాలంటూ టీజీఎస్పీడీసీఎల్, రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేబుల్‌‌‌‌‌‌‌‌ వైర్ల తొలగింపుపై రాతపూర్వక వాదనలు సమర్పించాలని ఆదేశిస్తూ, విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

 అప్పటివరకు కేబుళ్లను తొలగించవద్దంటూ ప్రభుత్వానికి సూచించింది. రామంతాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కరెంట్‌‌‌‌‌‌‌‌ షాక్‌‌‌‌‌‌‌‌ ఘటన తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు కేబుళ్లు తొలగించడాన్ని సవాలు చేస్తూ భారతి ఎయిర్‌‌‌‌‌‌‌‌ టెల్‌‌‌‌‌‌‌‌ బుధవారం లంచ్‌‌‌‌‌‌‌‌ మోషన్‌‌‌‌‌‌‌‌ పిటిషన్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్‌‌‌‌‌‌‌‌ నగేశ్‌‌‌‌‌‌‌‌ భీమపాక విచారణ చేపట్టగా.. పిటిషనర్‌‌‌‌‌‌‌‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. అన్ని అనుమతులు తీసుకున్నాకే స్తంభాల ద్వారా కేబుళ్లు తీసుకున్నామన్నారు. 

ఒక్కో స్తంభానికి రూ.1,100 చొప్పున రూ.21 కోట్లు వరకు ప్రభుత్వానికి చెల్లించామన్నారు. కేబుళ్ల తొలగింపునకు ముందు నోటీసు ఇవ్వాలన్న నిబంధన ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదని వివరించారు. దీనివల్ల లక్షల మంది ప్రజలతో పాటు ఎన్‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌టీ, డాక్టర్లు, న్యాయవాదులు, మీడియాకు ఇంటర్నెట్‌‌‌‌‌‌‌‌ అందుబాటులో లేక వ్యవస్థ స్తంభించిపోయిందన్నారు. 

టీజీపీసీడీఎల్‌‌‌‌‌‌‌‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఒక స్తంభానికి పరిమితికి మించి కేబుళ్లు ఉంటున్నాయన్నారు. ప్రజల ప్రాణాలు పోతున్నాయని, మనుషులే లేనప్పుడు కేబుళ్లు ఎందుకని ప్రశ్నించారు. వాదనలను విన్న న్యాయమూర్తి.. కేబుళ్ల పునరుద్ధరణకు ఉత్తర్వులు జారీ చేయాలన్న పిటిషనర్ల అభ్యర్థనను నిరాకరించారు. రాతపూర్వక వాదనలు సమర్పించాక ఉత్తర్వులిస్తామంటూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు.