టీఎస్​పీఎస్సీ సభ్యుల నియామకం రూల్స్​కు విరుద్ధం: హైకోర్టు

టీఎస్​పీఎస్సీ సభ్యుల నియామకం రూల్స్​కు విరుద్ధం:  హైకోర్టు
  • ఇష్టమైన వాళ్లను నియమించడం చెల్లదు: హైకోర్టు 
  • ఆరుగురి నియామకంపై మళ్లీ రివ్యూ చేయాలని ఆర్డర్
  • సమర్థత, జ్ఞానం లేని వాళ్లను పెడితే హైకోర్టు రద్దు చేయొచ్చు
  • పదవులు ఖాళీగా ఉన్నట్లు వాళ్లకు ఎట్ల తెలిసింది​
  • అప్లికేషన్స్‌‌ ఎలా సమర్పించారో కూడా తెలియట్లేదన్న కోర్టు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పబ్లిక్‌‌ సర్వీస్‌‌ కమిషన్‌‌ (టీఎస్​పీఎస్సీ) సభ్యుల నియామకాలు చట్ట ప్రకారం జరగలేదని హైకోర్టు తేల్చి చెప్పింది. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన కమిషన్‌‌లో చైర్మన్, మెంబర్స్‌‌ నియామకాలకు నిర్ధిష్టమైన విధివిధానాలు లేకపోయినప్పటికీ.. సుప్రీంకోర్టు జారీ చేసిన గైడ్‌‌లైన్స్‌‌ను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మండిపడింది. ఆరుగురు సభ్యుల నియామక ప్రక్రియను మూడు నెలల్లోగా మళ్లీ రివ్యూ చేయాలని ఆదేశించింది. సర్వీస్‌‌ కమిషన్‌‌ సభ్యుల నియామకాలు చట్ట వ్యతిరేకంగా చేశారని పేర్కొంటూ హైదరాబాద్‌‌కు చెందిన రిటైర్డ్‌‌ ప్రొఫెసర్‌‌ ఎ.వినాయక్‌‌ రెడ్డి దాఖలు చేసిన పిల్‌‌పై గతేడాది డిసెంబర్‌‌లో తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు చీఫ్‌‌ జస్టిస్‌‌ ఉజ్జల్‌‌ భూయాన్, జస్టిస్‌‌ సీవీ భాస్కర్‌‌ రెడ్డితో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ శుక్రవారం 80 పేజీల తీర్పు చెప్పింది.

రూల్స్​కు విరుద్ధం

నిర్వహించే పదవులకు తగ్గట్టుగా అర్హత, సామర్థ్యం ఉండాలని హైకోర్టు పేర్కొంది. ఉన్నత రాజ్యాంగ పదవుల్లో నియామకాలు చేపట్టేముందు వారి పూర్వాపరాలు విచారించడంతోపాటు నిశితంగా పరిశీలించాలని తెలిపింది. ‘‘నియామకాలకు రాజ్యాంగ విధివిధానం లేదని చెప్పి ప్రభుత్వం తన ఇష్టం వచ్చినవాళ్లను నియమించడానికి వీల్లేదు. ఇలా అనుభవం, సమర్థత, జ్ఞానం లేనివాళ్లను నియమిస్తే వాటిని రద్దు చేసే అధికారం హైకోర్టుకు ఉంది. హైకోర్టు తన విచక్షణాధికారం కింద రాజ్యాంగ పరిధుల్లో అలాంటి నియామకాలను రద్దు చేయవచ్చు. విచక్షణతో జరిపే నియామకంలో చర్చాప్రక్రియ ఉండితీరాలి కానీ అదిక్కడ జరగలేదు. సంప్రదింపులు కూడా చేయలేదు. నియమితులైన సభ్యులు ప్రముఖ వ్యక్తులుగా పేర్కొన్నప్పటికీ.. వారికి కూడా విద్యాపరంగా, అనుభవపరంగా, జ్ఞానపరంగా శక్తిసామర్థ్యాలు ఉండితీరాలి. సభ్యుల నియామకాల్లో అవి కొరవడ్డాయి” అని వివరించింది.

సరైన విధానంలో ఎంపిక చేయలేదు

పబ్లిక్‌‌ సర్వీస్‌‌ కమిషన్‌‌ చైర్మన్, మెంబర్స్‌‌ ఎంపిక ప్రక్రియ నిర్వహించేప్పుడు ప్రభుత్వం చర్చలు, సంప్రదింపులు నిర్వహించలేదని హైకోర్టు తెలిపింది. ‘‘వీళ్ల గురించి ఆలోచిస్తే వాళ్లు దరఖాస్తులను ఏ ప్రాతిపదికపై అప్లయ్‌‌ చేశారో అర్థమే కావడం లేదు. వీళ్ల బయోడేటా, అప్లికేషన్లను ఎవరు అడిగారో కూడా రికార్డుల్లో లేదు. ఏ ప్రాతిపదికన వాళ్లకు పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలుసుకున్నారో, ఎలా దరఖాస్తు చేసుకున్నారన్నది అర్థం చేసుకోలేకపోతున్నాం” అని పేర్కొంది. అయితే, చీఫ్‌‌ విజిలెన్స్‌‌ ఆఫీసర్స్‌‌తోపాటు పలు శాఖ అధికారులు రిపోర్టులు కూడా ఇచ్చేశారంది. వీళ్లపై కేసులు ల్లేవని ఏవిధమైన క్రమశిక్షణ చర్యలు, కేసులు లేవని రిపోర్టులు ఇచ్చారని తెలిపింది. ఈ ఫైలు జీఏడీ ముఖ్యకార్యదర్శి ప్రతిపాదించారు. సీఎం సంతకం తర్వాత గవర్నర్‌‌ ఆమోదించారు. 2021 మే 19న జీవో 108 జారీ అయ్యింది. ‘‘మొత్తం ప్రక్రియను పరిశీలిస్తే చైర్మన్, సభ్యుల ఎన్నిక ప్రక్రియకు సంబంధించి ఎలాంటి సంప్రదింపులు, చర్చ జరగలేదని స్పష్టమైతున్నది. ఎంపిక పక్రియ ఒక నిర్దిష్ట విధానం ప్రకారం జరగలేదు.

సభ్యులపై పలు ఆరోపణలు వచ్చిన తరుణంలో వాళ్లు ప్రముఖులా కాదా అనే అంశం జోలికి వెళ్లడం లేదు. ఈ విషయంపై అంచనా వేయడం సబబు కాదు. ప్రభుత్వం చెప్పినదాని ప్రకారం ప్రముఖులే నియమితులు అయ్యారు” అని హైకోర్ట్​ వెల్లడించింది. పున:సమీక్షకు మూడు నెలలు టైమ్​ ఇచ్చినందున ఈ దశలో ఆరుగురు సభ్యుల నియామకాల ప్రక్రియను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు అవసరం లేదని స్పష్టం చేసింది. చైర్మన్‌‌ జనార్దన్‌‌రెడ్డి, మెంబర్స్‌‌ బండి లింగారెడ్డిల బయోడేటా వివరాలను ఏజీ కవర్‌‌లో అందజేశారు. కె.అరుణకుమారి గురించి ఒక్క పేజీలో ఇచ్చారు. తెలుగు ఉపాధ్యాయురాలిగా ఉన్న సుమిత్ర ఆనంద్‌‌ తనోబా, రిటైర్డు తహసీల్దార్, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కారం రవీందర్‌‌ రెడ్డి గురించి కూడా వివరించారు. బీఏఎంఎస్‌‌ పూర్తి చేసిన ఎ.చంద్రశేఖర్‌‌రావు శ్రీతిరుమల నర్సింగ్‌‌ హోంను నిర్వహిస్తున్నారని, జర్నలిస్ట్‌‌ ఆర్‌‌.సత్యనారాయణ బీఏ చదివారని ఏజీ వివరించారు.

‘‘రాజ్యాంగ పరమైన కమిషన్ పదవుల భర్తీకి రూల్స్‌‌ నిర్ధిష్టంగా లేకపోయినప్పటికీ.. సుప్రీంకోర్టు గైడ్‌‌లైన్స్‌‌ ఉన్నాయి. కానీ ప్రభుత్వం వాటిని అమలు చేయలేదు. ఈ తరహా రాజ్యాంగ పదవుల భర్తీ చేసేప్పుడు చర్చ, సంప్రదింపులు, వడపోత ప్రక్రియ జరగాలి. దీన్ని పాటించకుండానే సభ్యులను నియమించారు. ప్రముఖ వ్యక్తులు అనే పదాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వానికి ఇష్టమైన వాళ్లను నియమించడానికి వీల్లేదు. కనుక ఆరుగురు సభ్యుల నియామకాల ప్రక్రియను 3 నెలల్లోగా పునఃసమీక్షించాలి” అని 80 పేజీల తీర్పులో హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.