
తెలంగాణలో గడువు తీరిన స్థానిక సంస్థలకు రిజర్వేషన్లు 50శాతం మించకుండా ఎలక్షన్లు నిర్వహించుకోవాలని చెప్పింది హైకోర్టు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9 మీద స్టే ఉండటంతో.. పాత విధానంలో ఎన్నికలకు ఓకే చెప్పింది. స్థానిక సంస్థల కాలపరిమితి దాటినప్పుడు రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ట్రిపుల్ టెస్టు నిర్వహించే పరిస్థితులు లేకపోతే ఎన్నికల సంఘం.. ఆ దామాషా సీట్లను ఓపెన్ కేటగిరీ సీట్లుగా నోటిఫి ఫై చేసి ఎన్నికలకు వెళ్లవచ్చని తెలిపింది.
రాహుల్ రమేశ్ వాగ్ కేసులో సుప్రీంకోర్టు 2022లో ఇచ్చిన మధ్యంతర ఉత్వర్వులను ప్రస్తావించింది హైకోర్టు. దీని ప్రకారం 42శాతం జీవోను కోర్టు నిలిపివేసినందున దామాషా సీట్లను ఓపెన్ కేటగిరీలో నోటిఫై చేసి స్థానిక ఎన్నికలకు వెళ్లవచ్చని స్పష్టత ఇచ్చింది. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో 9,ఎన్నికల ప్రక్రియకు సంబంధించి జారీ చేసిన 41,42లను ఎన్నికల షెడ్యూల్ ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ అపరేశ్, జస్టిస్ మొహియుద్దీన్ లతో కూడిన ధర్మాసనం స్టే ఇచ్చింది.తదుపరి విచారణను డిసెంబర్ 3కు వాయిదా వేసింది కోర్టు. దీనికి సంబంధించిన పూర్తి ఆర్డర్ కాపీ అర్థరాత్రి అందుబాటులోకి వచ్చింది.