హుజూర్ నగర్ కి 100 కోట్లు ఇచ్చారుగా.. ఆర్టీసీకి ఎందుకివ్వలేరు

హుజూర్ నగర్ కి 100 కోట్లు ఇచ్చారుగా.. ఆర్టీసీకి ఎందుకివ్వలేరు

రూ.47 కోట్లు వెంటనే ఇవ్వలేమని చెప్పడంతో హైకోర్టు ఆగ్రహం

అతి తెలివి ప్రదర్శించొద్దంటూ బ్యూరోక్రాట్లపై ధర్మాసనం అసహనం

ఆర్టీసీకి సర్కార్ ఇవ్వాల్సిన బకాయిల లెక్క అడిగితే.. ఎంత ఇచ్చారో చెబుతారేం?

అధికారులు ఉద్దేశపూర్వకంగానే స్పష్టత లేని నివేదిక ఇచ్చారన్న ధర్మాసనం

హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో రోజూ వాడీవేడిగా వాదనలు జరుగుతున్నాయి. ఆర్టీసీకి ఇవ్వాల్సిన బకాయిలపై నివేదిక కోరుతూ నిన్న విచారణను వాయిదా వేసిన ధర్మాసనం ఇవాళ ప్రభుత్వ లాయర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్యూరోక్రాట్లు రూపొందించిన కౌంటర్ అస్పష్టంగా ఉందంటూ అసహనం వ్యక్తం చేసింది. అతి తెలివి ప్రదర్శించొద్దంటూ మందలించింది కోర్టు.

ఆర్టీసీకి ఎంత బకాయి పడ్డారో చెప్పమని అడిగితే.. ఎంత ఇచ్చారో చెబుతారేంటి అంటూ హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం రూ.4253 కోట్లు ఇస్తే, బకాయిలు చెల్లించాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించింది. తమకు సమర్పించే నివేదికలో బ్యూరోక్రాట్లు అతి తెలివి ప్రదర్శించారని అసహనం వ్యక్తం చేసింది.

ఉద్దేశపూర్వకంగానే అధికారులు స్పష్టత లేని నివేదికలిస్తున్నారని మండిపడింది. ఆర్టీసీకి కేటాయించిన నిధులను ఎలా క్యాటగిరి చేశారో వివరించాలని సూచించింది. బ్యాంక్ గ్యారెంటీకి ఇచ్చిన నిధుల్లో డీ ఫాల్టర్ మీరే కదా అని ప్రభుత్వాన్ని పప్రశ్నించింది హైకోర్టు.

ఈ సమయంలో రీ ఎంబర్స్ మెంట్ బకాయిలు రూ.1099 కోట్లు ఉన్నాయన్న సర్కారు తరఫు లాయర్ చెప్పారు. విభజన చట్టాన్ని తెరపైకి తెచ్చారు. బకాయిల్లో 42 శాతం తెలంగాణ,  58 శాతం ఏపీ చెల్లించాలని, ఆర్టీసీ విభజన అంశం కేంద్ర ప్రభుత్వ వద్ద పెండింగులో ఉందని వాదించారు.

47 కోట్లు వెంటనే ఇవ్వలేమన్న సర్కార్ లాయర్

ప్రస్తుతం ఆర్టీసీకి రూ.47 కోట్లు కూడా వెంటనే ఇవ్వలేమని ప్రభుత్వం తరఫు లాయర్ చెప్పారు. దీంతో హైకోర్టు ప్రభుత్వాన్ని తప్పుబట్టింది. ఉప ఎన్నిక జరిగిన హుజూర్ నగర్ కి రూ.100 కోట్లు ఇచినప్పుడు… రాష్ట్ర ప్రజలందరి ప్రయోజనాల కోసం ఆర్టీసీకి ఎందుకు ఇవ్వలేరని ప్రశ్నించింది. నాలుగు డిమాండ్లకు అవసరమయ్యే 47 కోట్లు ఇస్తే కార్మికులు విధుల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తున్నా.. ప్రభుత్వం ఎందుకు ఆ దిశగా ప్రయత్నం చేయడం లేదని అడిగింది. ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అనుసరిస్తోందని, ప్రజలు ఇబ్బందిపడకుండా తగినన్ని బస్సులు తిప్పుతున్నామని చెబుతూనే స్కూళ్లకు సెలవులు ఎందుకిచ్చినట్లని ప్రశ్నించింది హైకోర్టు. ఆర్టీసీకి ఇవ్వాల్సిన బకాయిలపై స్పష్టమైన నివేదిక ఇవ్వాలని మరోసారి ఆదేశించింది. ఆర్టీసీ కార్మికులను సమ్మె విరమించాలని ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు చెప్పింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.