- ప్రభుత్వం, సిగాచీకి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: సిగాచీ పేలుడులో మృతి చెందిన, అదృశ్యమైన వ్యక్తుల బంధువులకు వివిధ హెడ్‌ల కింద పరిహారం పంపిణీకి సంబంధించిన వ్యత్యాసాలపై వివరణ ఇవ్వాలంటూ సిగాచీకి, ప్రభుత్వానికి గురువారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కంపెనీ ప్రకటించిన మొత్తంతోపాటు చట్టాల కింద అందించాల్సిన పరిహారం వివరాలివ్వాలని ఆదేశించింది. రాష్ట్ర, సంగారెడ్డి లీగల్ సర్వీసెస్ అథారిటీలు బాధిత కుంటుంబాలకు అవసరమైన న్యాయ సాయం అందించాలని, దీనికి సంబంధించిన నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో సిగాచీ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలుడు సంఘటనలో 56 మంది మృతి చెందగా, 8 మంది కనిపించలేదని, 28 మంది తీవ్రంగా గాయపడ్డారని వారికి పరిహారం అందించడంతోపాటు దర్యాప్తును సిట్‌కు అప్పగించాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన కె.బాబూరావు హైకోర్టులో దాఖలు చేసిన పిల్‌పై చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్‌తో కూడిన బెంచ్ గురువారం విచారణ చేపట్టింది.
ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ తేరా రజనీకాంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. మొత్తం నాలుగు కేసులు నమోదు చేశామని, రెండు కేసుల్లో దర్యాప్తు పూర్తయిందని, చార్జిషీట్లు దాఖలు చేశామని తెలిపారు. ఫ్యాక్టరీ, అగ్నిమాపకశాఖలు నమోదు చేసిన కేసుల్లో దర్యాప్తు జరుగుతున్నదని సమన్లు జారీ అయ్యాయని చెప్పారు. పరిహారానికి సంబంధించి రూ.23.17 కోట్లు పంపిణీ చేయడానికి అంగీకరించామని, కొంత మొత్తం చెల్లించామని, మిగిలిన రూ.6.05 కోట్లకు పోస్టు డేటెడ్ చెక్కులు పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు.
కంపెనీ తరఫు న్యాయవాది జి.అశోక్ రెడ్డి వాదనలు వినిపిస్తూ రూ. 23,17 కోట్లు చెల్లించడానికి అంగీకరించామని, ఇందులో 16.44 కోట్లు చెల్లించామని, మిగిలిన రూ.6.05 కోట్లకు పోస్టుడేటెడ్ చెక్కులు అందజేసినట్టు వెల్లడించారు. వాదనలను విన్న ధర్మాసనం ఈపీఎఫ్, ఈఎస్‌ఐ, ఔషధ నియంత్రణ మండళ్లను ప్రతివాదులుగా చేర్చుతూ నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను మార్చి 12వ తేదీకి వాయిదా వేసింది.
