
- ద్వితీయ భాషగా అమలు చేసే ప్రణాళికను సమర్పించాలని రాష్ట్రానికి హైకోర్టు నోటీసులు
- రెండు వారాలకు విచారణ వాయిదా
హైదరాబాద్, వెలుగు: రెండో తరగతి నుంచి 9వ తరగతి వరకు ద్వితీయ భాషగా తెలుగును ఒకేసారి కాకుండా దశల వారీగా అమలు చేసే అంశంపై కార్యాచరణ ప్రణాళికను సమర్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ అన్ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో తెలుగును ద్వితీయ భాషగా పేర్కొంటూ అమలు చేసే తీరుపై నివేదిక ఇవ్వాలని గురువారం ఆదేశించింది. అనంతరం తెలుగును తప్పనిసరి చేస్తూ 2024 డిసెంబర్ 7, 19 తేదీల్లో ప్రభుత్వం జారీ చేసిన ప్రొసీడింగ్స్ అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వుల జారీకి నిరాకరించింది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ, కేంబ్రిడ్జి, ఇతర జాతీయ బోర్డు స్కూళ్లల్లో తెలుగును ద్వితీయ భాషగా తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్ 7, 19 తేదీల్లో జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను సవాల్ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన ప్రమీలా పాతక్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.
దీనిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ట్ ఎం. మొహియుద్దీన్‌ల ధర్మాసనం గురువారం విచారించింది. పిటిషనర్ న్యాయవాది వాదిస్తూ, మొదట 6వ తరగతికి తప్పనిసరిగా తెలుగును ప్రవేశపెట్టి ఆ తర్వాత ప్రతి ఏడాది ఒక్కో తరగతికి పెంచుకుంటూ రావాలన్నారు. 2018 నిర్బంధ విద్యాహక్కు చట్టం కింద తెలుగు భాషను ద్వితీయ భాషగా అమలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా.. కోవిడ్, తదితర ఇతర కారణాల వల్ల అమలు కాలేదన్నారు. గతేడాది జారీ చేసిన ఉత్తర్వుల వల్ల ఈసారి 8, 9 తరగతులకు కూడా అమలు చేస్తున్నారని చెప్పారు. ఇతర భాషల్లో చదివిన వారికి ఒక్కసారిగా తెలుగును తప్పనిసరి చేస్తే తీవ్ర నష్టం వాటిళ్లుతుందని పేర్కొన్నారు.
ఈ విషయంలో కొంత మంది తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయిస్తే తెలుగును ద్వితీయ భాషగా అమలు చేయాలని ఒత్తిడి తేవొద్దంటూ సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారని గుర్తుచేశారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది వాదిస్తూ.. ఇప్పటికే ఒకటి నుంచి 8వ తరగతి వరకు ప్రభుత్వ, ఆన్ఎయిడెడ్, పలు ప్రైవేటు పాఠశాలల్లో తెలుగు అమలవుతోందని చెప్పారు. 10వ తరగతిని దృష్టిలో ఉంచుకుని 9, 10వ తరగతులకు ప్రతి ఏడాది మినహాయింపునిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తోందన్నారు.
ప్రస్తుతం పిటిషనర్లు 6వ తరగతి నుంచి తెలుగును అమలు చేయకూడదంటున్నారని చెప్పారు. వాదనలను విన్న దర్మాసనం తెలుగును ద్వితీయ భాషగా దశలవారీగా అమలుకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను సమర్పించాలని ఆదేశిస్తూ.. విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. అదేవిధంగా సింగిల్ జడ్జి వద్ద ఉన్న రిట్ పిటిషన్‌ను కూడా దీంతో జత చేయాలని రిజిస్త్రీని ఆదేశించింది.