
- పాయిఖానా కట్టేందుకు కూడా జాగా మిగల్లేదు..
- అనర్హులకు ప్రభుత్వాలు వేల ఎకరాలు కట్టబెట్టినయ్
- తీవ్రంగా తప్పుబట్టిన హైకోర్టు
- పేదలకు ఇవ్వాల్సిన స్థలాలనూ కంపెనీలకు ఇచ్చేశారు
- ఆక్రమణలను కూడా క్రమబద్ధీకరించేశారు
- పంచుకుంటూపోవడంతో మిగిలిందేమిటని ప్రశ్న
హైదరాబాద్, వెలుగు: గతంలో వేల ఎకరాల భూములను ప్రభుత్వాలు అనర్హులకు కేటాయించేశాయని, ఫలితంగా ప్రస్తుతం పాయిఖానా కట్టేందుకు కూడా ప్రభుత్వ స్థలం లేకుండా పోయిందని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. ‘‘అర్హులైన పేదలకు కేటాయించాల్సిన భూములను కంపెనీలకు, ఆదాయవర్గాలకు ఇచ్చుకుంటూ పోయారు. కమ్యూనిటీ అవసరాలకు అప్పగించుకుంటూ పోయారు. ఆక్రమణలను క్రమబద్ధీకరించేశారు. ఇట్ల వేల ఎకరాలు పంచిపెట్టడంతో ఇప్పుడు ఏమీ మిగల్లేదు. మరుగుదొడ్డి నిర్మించేందుకు కూడా ప్రభుత్వ స్థలం లేకుండా పోయింది.. అంగుళం కూడా మిగలలేదు” అని పేర్కొంది. వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం అంతరం గ్రామంలోని సర్వే నం. 32, 82లో హేచరీ నిర్మాణం కోసం 6 ఎకరాలు కేటాయించాలన్న వినతిపత్రంపై చర్యలు తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ ఎండీ ఖలీల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డి సోమవారం విచారణ చేపట్టారు.
పిటిషనర్ తరఫు అడ్వకేట్ ముమ్మనేని శ్రీనివాసరావు వాదనలు వినిపిస్తూ.. 2022లో కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించామని, దీన్ని ప్రభుత్వానికి పంపలేదని అన్నారు. ‘ఎండీ ఖలీల్ ఫామ్స్’ పేరుతో హేచరీ నిర్మాణానికి స్థలం కేటాయించాలని వినతి పత్రం సమర్పించామని చెప్పారు. జీవో 571 ప్రకారం భూకేటాయింపు జరపాలంటూ ఇచ్చిన వినతిపత్రంపై చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. ఏ ప్రాతిపదికన భూమిని కేటాయించాలని ప్రశ్నించారు. హేచరీ నిర్మాణం వల్ల ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో చెప్పాలన్నారు. దీనిపై ప్రభుత్వ వివరణ తీసుకోకుండా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని స్పష్టం చేశారు. ప్రభుత్వ వివరణ కోరుతూ విచారణను ఈ నెల 22కు వాయిదా వేశారు.