హైదరాబాద్, వెలుగు: పోలీసులతో వాదన చేసినందుకు ఓ వ్యక్తిపై కేసు నమోదు చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఈ చర్య చట్టప్రక్రియ దుర్వినియోగమని, పోలీసుల తీరు ఆక్షేపణీయమని మండిపడింది. ములుగు జిల్లా మంగపేట మండలం రాజుపేటకు చెందిన రాజశేఖర్ అనే వ్యక్తిపై పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. 2022 ఫిబ్రవరిలో రాజశేఖర్ తమ విధులకు ఆటంకం కలిగించారని మంగపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని రాజశేఖర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
రాజశేఖర్ తరఫు లాయర్ వాదిస్తూ.. రోడ్డు ఆక్రమణ విషయంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరుగుతుండగా, రాజశేఖర్ అక్కడికి వెళ్లి పోలీసులతో వాదించారని కోర్టుకు తెలిపారు. పిటిషనర్ పోలీసులను బెదిరించినట్లు ఆధారాల్లేవన్నారు. ఎఫ్‌ఐఆర్, ఛార్జిషీటు రికార్డులను పరిశీలించిన కోర్టు.. పోలీసులను బెదిరించినట్లు ఆధారాల్లేవని గుర్తించింది. వాదన చేసినందుకు కేసు నమోదు చేయడం చట్టాన్ని దుర్వినియోగం చేయడమేనంటూ కేసును కొట్టివేసింది.
