యూనియన్ బ్యాంక్ తీరును తప్పుపట్టిన హైకోర్టు..అప్పీల్ పిటిషన్ను డిస్మిస్ చేస్తూ తీర్పు

యూనియన్ బ్యాంక్ తీరును తప్పుపట్టిన హైకోర్టు..అప్పీల్ పిటిషన్ను డిస్మిస్ చేస్తూ తీర్పు

హైదరాబాద్, వెలుగు: రుణాలు చెల్లించలేక అధికారిక లిక్విడేటర్ పరిధిలోని కంపెనీ ఆస్తిని లిక్విడేటర్ ప్రమేయం లేకుండా వేలం వేసిన యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా తీరును హైకోర్టు తప్పు పట్టింది. బీఆర్ ఎనర్జీ లిమిటెడ్​కు చెందిన ఆస్తి వేలాన్ని రద్దు చేస్తూ కంపెనీ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. కంపెనీ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ బ్యాంకు దాఖలు చేసిన అప్పీలును జస్టిస్ కె. లక్ష్మణ్, జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డితో కూడిన డివిజన్ బెంచ్ రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. 

కంపెనీ డైరెక్టర్ రూ.32.39 కోట్లకు ఆస్తిని కొనడానికి పార్టీని తీసుకువచ్చి, రూ.10 కోట్లు బ్యాంకు పేరుతో డీడీని తీసుకువచ్చిన దాన్ని పట్టించుకోకుండా వేలం నిర్వహించి రూ.25.80 కోట్లకు విక్రయించడం సరికాదని తేల్చింది. వేలంలో ఆస్తిని పొంది రూ.6.45 కోట్లు చెల్లించిన కేజేఎస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్​ఆ సొమ్మును వడ్డీతో తిరిగి చెల్లించాలని కోరింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్పీలును డిస్మిస్ చేస్తూ తీర్పు చెప్పింది.