
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మున్సిపల్ ఎలక్షన్లపై హైకోర్టుకు పిటిషన్లు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం కూడా వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించి 15కుపైగా రిట్లు దాఖలయ్యాయి. ఇందులో కరీంనగర్ వంటి కీలక కార్పొరేషన్, సూర్యాపేట వంటి మున్సిపాలిటీ కూడా ఉన్నాయి. ఆ పిటిషన్లను పరిశీలించిన హైకోర్టు.. అభ్యంతరాలను పరిష్కరించి, చట్టబద్ధంగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేశాకే ఎలక్షన్లు నిర్వహించాలని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.
రాత్రికి రాత్రే మార్చేశారు
కరీంనగర్‌లోని మూడో డివిజన్‌లో ఎస్టీలు ఎక్కువగా ఉన్నారు. 16వ తేదీన వారందరినీ రెండో డివిజన్‌లోకి మార్చారు. దీంతో రెండో డివిజన్‌లోని ఎస్సీలకు అన్యాయం జరిగిందంటూ అక్కడివారు హైకోర్టును ఆశ్రయించారు. ఒక వార్డులో ఎస్టీలు ఎక్కువగా ఉన్నప్పుడు అది చట్టప్రకారం ఎస్టీలకే రిజర్వు చేయాల్సి ఉంటుందని కోర్టుకు వివరించారు. 16న వారిని డివిజన్ మార్చేయకుండా ఉంటే మూడో డివిజన్ ఎస్టీలకు, రెండో డివిజన్ ఎస్సీలకు రిజర్వు అయ్యేవని.. కానీ ఈ నిర్వాకం వల్ల మూడో డివిజన్ జనరల్ అయిందని తెలిపారు. వాదనలు విన్న కోర్టు అభ్యంతరాలను పరిష్కరించాకే ఎలక్షన్లు నిర్వహించాలని ఆదేశించింది. అధికారులు చట్ట ప్రకారం వ్యవహరిస్తే.. ఇంత పెద్ద సంఖ్యలో కేసులు రావడానికి ఆస్కారం లేదని న్యాయమూర్తి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ సమస్యల్నింటినీ పరిష్కరిస్తామని ప్రభుత్వ అదనపు ఏజీ రామచందర్‌రావు కోర్టుకు చెప్పారు. విచారణ 22వ తేదీకి వాయిదా పడింది.