సేవాలాల్ మందిరానికి ప్రభుత్వ భూమి లీజు ఆదేశాలపై హైకోర్టు స్టే

సేవాలాల్ మందిరానికి ప్రభుత్వ భూమి లీజు ఆదేశాలపై హైకోర్టు స్టే
  •     బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్​ నాయక్‌‌‌‌కు నోటీసులు జారీ

హైదరాబాద్, వెలుగు: మహబూబాబాద్‌‌‌‌లోని అనంతారం గ్రామంలో ఉన్న 1.07 ఎకరాల ప్రభుత్వ భూమిని సేవాలాల్ మందిరానికి దీర్ఘకాలిక లీజుకు, లేదా మార్కెట్‌‌‌‌ ధరకు ఇచ్చే వ్యవహారాన్ని పరిశీలించాలని అధికారులకు గతంలో లోకాయుక్త ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది.  ఈ మేరకు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన కోర్టు.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌‌‌‌నాయక్‌‌‌‌కు నోటీసులు జారీ చేసింది. 

కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించి, విచారణను నవంబరు 21కి వాయిదా వేసింది. మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌‌‌‌నాయక్ మరో నలుగురితో కలిసి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారని.. అనంతారం గ్రామంలో సుమారు 15 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారని ఓ రైతు లోకాయుక్తకు ఫిర్యాదు చేశాడు. ఈ ట్రస్ట్ సేవాలాల్ మందిర నిర్మాణం, అతిథి గృహం కోసం ప్రభుత్వ భూమిని ఉపయోగిస్తోందని ఆరోపించాడు. 

ఈ ఫిర్యాదును విచారించిన లోకాయుక్త.. కలెక్టర్‌‌‌‌ నుంచి నివేదిక తెప్పించి, సేవాలాల్‌‌‌‌ మందిర నిర్మాణం జరుగుతున్న భూమిని శంకర్‌‌‌‌నాయక్‌‌‌‌ ట్రస్ట్ కు లీజు, లేదా , లేదా మార్కెట్‌‌‌‌ ధరకు ఇచ్చే వ్యవహారాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ మహబూబాబాద్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌ హైకోర్టులో అప్పీల్‌‌‌‌ పిటిషన్‌‌‌‌ వేశారు. ఈ పిటిషన్‌‌‌‌ను హైకోర్టు డివిజన్ బెంచ్ గురువారం విచారించింది.

ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌‌‌‌ జనరల్‌‌‌‌ తేరా రజనీకాంత్‌‌‌‌రెడ్డి వాదిస్తూ.. లోకాయుక్త తన అధికార పరిధిని దాటి అధికారులకు ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఈ ఉత్తర్వులు తెలంగాణ అసైన్డ్‌‌‌‌ భూముల (బదిలీ నిషేధం) చట్టం-1977, తెలంగాణ లోకాయుక్త చట్టం-1983 నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. సేవాలాల్‌‌‌‌ మందిర నిర్మాణం కోసం భూమిని ఆక్రమించినట్లు శంకర్‌‌‌‌నాయక్‌‌‌‌(ప్రతివాది-2) లోకాయుక్త విచారణలో ఒప్పుకున్నారని తెలిపారు. లోకాయుక్త ఆదేశాలు రాజ్యాంగ ఆర్టికల్ 14 (సమానత్వం)ను ఉల్లంఘిస్తున్నాయని..అందువల్ల లోకయుక్త ఆదేశాలను వెంటనే రద్దు చేయాలని కోరారు