పార్టీ ఫిరాయింపులపై..స్పీకర్‌‌ తీర్పును రద్దు చేయండి : బీఆర్‌‌ఎస్ ఎమ్మెల్యేలు

పార్టీ ఫిరాయింపులపై..స్పీకర్‌‌ తీర్పును రద్దు చేయండి : బీఆర్‌‌ఎస్ ఎమ్మెల్యేలు
  •     హైకోర్టులో 9 పిటిషన్‌‌లు దాఖలు..నేడు ఏడింటిపై విచారణ

హైదరాబాద్, వెలుగు: బీఆర్‌‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌‌లోకి చేరిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశం మళ్లీ హైకోర్టుకు చేరింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్లను స్పీకర్ కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ బీఆర్‌‌ఎస్ ఎమ్మెల్యేలు 9 పిటిషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్‌‌లో చేరినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ, స్పీకర్ వాటిని పరిగణనలోకి తీసుకోకుండా రాజ్యాంగంలోని పదో షెడ్యూలుకు విరుద్ధంగా తీర్పు ఇచ్చారని బీఆర్‌‌ఎస్ నేతలు తమ పిటిషన్‌‌లో పేర్కొన్నారు.ముఖ్యంగా, దానం నాగేందర్ వంటి వారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే కాంగ్రెస్ తరఫున లోక్‌‌సభకు పోటీ చేసినా, అసెంబ్లీ బయట జరిగిన అంశాలను పరిగణనలోకి తీసుకోలేమనడం సరికాదన్నారు. 

స్పీకర్ ఇచ్చిన తీర్పులను రద్దు చేసి.. పార్టీ ఫిరాయించిన టి.ప్రకాశ్‌‌గౌడ్, అరికెపూడి గాంధీ, తెల్లం వెంకటరావు, బండ్ల కృష్ణమోహన్‌‌రెడ్డి, కాలే యాదయ్య, దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్‌‌రెడ్డి, కడియం శ్రీహరి, గూడెం మహిపాల్‌‌రెడ్డి, సంజయ్‌‌కుమార్‌‌లపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్‌‌ఎస్‌‌ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్, కె.పి.వివేకానంద, పల్లం రాజేశ్వర్‌‌రెడ్డి, చింతా ప్రభాకర్, పాడి కౌశిక్‌‌ రెడ్డి, జి.జగదీశ్‌‌రెడ్డి పిటిషన్‌‌లు దాఖలు చేశారు. ఈ తొమ్మిదింటిలో ఏడింటిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టనుంది.