ఆ 23 ఊర్లు ఆదివాసీ గ్రామాలే

ఆ 23 ఊర్లు ఆదివాసీ గ్రామాలే

ములుగు జిల్లా మంగపేట మండలంలోని గ్రామాలపై హైకోర్టు తీర్పు

  •     ఆ ఊర్లన్నీ ఐదో షెడ్యూల్ పరిధిలోకే వస్తాయని జడ్జిమెంట్ 
  •     73 ఏండ్ల నాటి వివాదానికి ఫుల్ స్టాప్

హైదరాబాద్, వెలుగు :  ములుగు జిల్లా మంగపేట మండలంలోని 23 రెవెన్యూ గ్రామాలు ఆదివాసీ గ్రామాలేనని, అవన్నీ ఐదో షెడ్యూల్‌ పరిధిలోకే వస్తాయని హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఏకంగా 73 ఏండ్లుగా కొనసాగుతున్న వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టింది. ఆ 23 ఊర్లను షెడ్యూల్డ్ ప్రాంతాలుగా ప్రకటిస్తూ గతంలో సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ బుధవారం హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ సీవీ భాస్కర్‌ రెడ్డితో కూడిన డివిజన్‌ బెంచ్‌ తీర్పు చెప్పింది. 

సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ మర్రి వేంకటరాజా, ఇతరులు దాఖలు చేసిన అప్పీల్‌ పిటిషన్లను కొట్టేసింది. ఆ గ్రామాలన్నింటినీ1940కి ముందే నిజాం సర్కార్‌ షెడ్యూల్‌ ఏరియాగా ప్రకటించిందంటూ ఆదివాసీల తరఫు అడ్వకేట్ చిక్కుడు ప్రభాకర్ వాదనలను కోర్టు సమర్థించింది. 

1950 నుంచీ వివాదం 

రాజ్యాంగం అమల్లోకి వచ్చాక తాలూకాల పునర్విభజన చేస్తూ ప్రభుత్వం1950 ఏప్రిల్‌ 21న ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా పాల్వంచ షెడ్యూల్డ్‌ ఏరియా పరిధిలోని 23 రెవెన్యూ విలేజ్‌లను ములుగు పరిధిలోని మంగపేటలో విలీనం చేసింది. దీనిపై వివాదం ఏర్పడటంతో 1950 నుంచి 2006 వరకు ఆ ఊర్లు షెడ్యూల్డు ప్రాంతాలుగా గుర్తింపునకు నోచుకోలేదు. 2006 ఎన్నికల సమయంలో వాటిని షెడ్యూల్డ్‌ ఏరియాగా పరిగణిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 2011 ఎన్నికల సమయంలో కూడా ఇదే అంశంపై వివాదం కొనసాగింది. ఈ వివాదం కారణంగా 2006 నుంచి ఈ గ్రామాల్లో ఎన్నికలు జరగలేదు.1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని షెడ్యూలు 5 పేరా 8(1)లో ఈ గ్రామాలను చేర్చలేదని పిటిషనర్లు వాదించారు. 

అయితే, అవి షెడ్యూల్డ్‌ ఏరియా కిందకు రావన్న వాదనను సింగిల్‌ జడ్జి తోసిపుచ్చుతూ తీర్పు చెప్పారు. 1949 నాటి నిజాం సర్కార్‌ ఉత్తర్వుల ప్రకారం ఆ 23 విలేజ్‌లు ఏజెన్సీ ఏరియాలోనే ఉన్నాయన్నారు. దీనిపై అప్పీల్‌ పిటిషన్లు దాఖలవ్వగా తాజాగా సింగిల్‌ జడ్జి తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించింది. రాజ్యాంగానికి ముందే అవి షెడ్యూల్ ఏరియాలో ఉన్నాయని, ఆ తర్వాత వీటి సరిహద్దులను మార్చారు తప్ప స్వరూపాన్ని కాదని హైకోర్టు తేల్చిచెప్పింది.