హైకోర్ట్ తీర్పు కేసీఆర్ సర్కార్ కి చెంపదెబ్బ

హైకోర్ట్ తీర్పు కేసీఆర్ సర్కార్ కి చెంపదెబ్బ
  • సీఎస్ సోమేశ్ కుమార్ ని బర్త్ రఫ్ చేయాలి
  • 208 జీవోని వెనక్కి తీసుకోవాలి
  • ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రావణ్ డిమాండ్

హైదరాబాద్: ‘‘హైకోర్ట్ తీర్పు కేసీఆర్ సర్కార్ కి చెంపదెబ్బ... సీఎస్ సోమేశ్ కుమార్ ని బర్త్ రఫ్ చేయాలి. 208 జీవోని వెనక్కి తీసుకోవాలి ’’ అని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ డిమాండ్ చేశారు. సీఎస్ సోమేశ్ కుమార్‌ తన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ప్రజాధనం ఎలా ఖర్చు చేస్తారు..? రాజ్యాంగానికి విరుద్దంగా పని చేస్తూ ప్రజాధనం దుర్వనియోగం చేస్తున్న సీఎస్ కు పదవిలో కొనసాగే అర్హత ఉందా ? అని ఆయన ప్రశ్నించారు. హైకోర్టు తీర్పు నేపధ్యంలో దాసోజు శ్రవణ్ కుమార్ స్పందించారు. 
కోర్టులు ఇచ్చిన తీర్పులని సవాల్ చేస్తూ కన్టెంప్ట్ కింద న్యాయ స్థానాలతో పోరాడటమే ఒక తప్పు.. అది చాలదన్నట్టు ఆ దిక్కరణ కేసులు ఎదుర్కోవడానికి కూడా ప్రజా సొమ్ముని వాడుకోవడం సహించరాని నేరం. ఇదేం ప్రభుత్వం ? ఇంత దుబారా ఎందుకు ? ప్రజల సొమ్ముని వాడుకోవడం ఏంటి?  సీఎస్ సోమేశ్ కుమార్‌ తెలంగాణ అల్లుడా ? ..’’ అని ప్రశ్నల వర్షం కురిపించారు. కోట్ల రూపాయిలు దుబారా ఖర్చులకి అలవాటైపోయిన కేసీఆర్ సర్కార్ .. సీఎస్ కోర్టు దిక్కరణ కేసులు విచారణ కు 59కోట్ల రూపాయిలు ఇవ్వడానికి 208 జీవో తెచ్చారని ఆయన ఆరోపించారు. అసలు కేసీఆర్ సర్కార్ కి సిగ్గుందా ? ప్రజల డబ్బుతో తమాషా చేస్తున్నారా ? లక్షల రూపాయిలు జీతాలు తీసుకుంటున్నారు..  హైకోర్ట్ లో జీపీలు ( గవర్నమెంట్ ప్లీడర్ ) ఎజీపీలు , అడ్వకేట్ జనరల్ ,అడిషినల్ అడ్వకేట్ జనరల్  వున్నారు..  వీళ్లందరికీ ప్రభుత్వ సొమ్ముతో జీతాలు ఇస్తున్నాం.. ప్రభుత్వ పరంగా సీఎస్ న్యాయపోరాటం చేయాలనుకుంటే వీరంతా ఏం చేస్తున్నారు ?  వీరితో ఎందుకు న్యాయపోరాటం చేయించడం లేదు? కోట్ల రూపాయిలు పెట్టి పెద్ద అడ్వకేట్లని ఢిల్లీ నుంచి రప్పించి ఇక్కడ న్యాయస్థానంపై ప్రభావం చూపే విధంగా కోర్టులతో కొట్లాట పెట్టుకుంటారా ? ఇది ప్రజాస్వామ్యమా ? అని దాసోజు శ్రవణ్ కుమార్ నిలదీశారు. 
హైకోర్టు ఆదేశాలను కాంగ్రెస్ తరపున స్వాగతిస్తున్నాం
''టీఆర్ఎస్ ప్రభుత్వ దుబార వైఖరిని నిరసిస్తూ జీవో 208ని తప్పుపడుతూ గౌరవ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలని కాంగ్రెస్ పార్టీ తరపున స్వాగతిస్తున్నామని ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రావణ్ అన్నారు. కోర్టు ధిక్కరణ కేసుల విచారణ ఖర్చుల కోసం తెలంగాణ ప్రభుత్వం, సీఎస్ సోమేశ్ కుమార్‌ కు రూ. 58కోట్ల మంజూరు చేయడం దుర్మార్గం అన్నారు. ప్రభుత్వ అధికారులు రాజ్యాంగానికి చట్టానికి రక్షకులుగా వుండాలి.. కానీ తెలంగాణలో దురదృష్టశాత్తు ప్రభుత్వానికి లొంగిపోయి రాజ్యాంగానికి, ప్రజా ప్రయోజనానికి వ్యతిరేకంగా పాలసీలు  తీసుకొస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థతిలో ప్రజలు కోర్టుని ఆశ్రయయిస్తారని తెలిపారు. కోర్టు ఇచ్చిన తీర్పుని శిరసవహిస్తూ చేసిన తప్పుని సరిదిద్దుకొని పాలన చేయాలని ఆయన సూచించారు. రాష్ట్రాన్ని నాగులు లక్షల కోట్ల అప్పుల్లో ముంచేంది టీఆర్ఎస్ ప్రభుత్వం అని ఆయన ఆరోపించారు.  మంత్రి హరీష్ రావ్ జీఎస్స్టి కౌన్సిల్ మీటింగ్ లో మాట్లాడుతూ  లాక్ డౌన్ కారణంగా నాలుగు వేల నాలుగు వందల కోట్ల నష్టం వచ్చింది, ఆర్ధిక భారాన్ని భరించలేకపోతున్నామని వాపోయారని ప్రస్తావిస్తూ..  ఆ మాట చెప్పిన పొద్దున్నే  దాదాపు 12కోట్ల రూపాయిలు పెట్టి 32కియా కార్లుకొని గిఫ్ట్ లుగా పంచిన గొప్ప ప్రభుత్వం కేసీఆర్ ది '' అని దాసోజు శ్రవణ్ ఎద్దేవా చేశారు. సీఎస్ కోర్టు దిక్కరణ కేసులు విచారణకు 59 కోట్ల రూపాయిలు ఇవ్వడానికి 208 జీవో తెచ్చారని ఆయన ప్రస్తావిస్తూ ఈ 59కోట్ల రూపాయిలతో 59 బడులు కట్టొచ్చు , 59 హాస్పిటల్స్ కట్టొచ్చు,  ప్రజలకు మౌలిక  వసతులు కల్పించడానికి వాడొచ్చు,  ప్రభుత్వ అధికారి సీఎస్ చేసిన తప్పులని కప్పిపుచ్చుకోవడానికి ప్రజల సొమ్ముని వాడుకునే హక్కు ఎవరిచ్చారు ? కేసీఆర్ కి సీఎస్ అంటే అంత ఇష్టం వుంటే ఇంటికి పిలిచి భోజనం పెట్టండి. అంతేకానీ అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు ప్రజలు సొమ్ము 59కోట్లు ఎలా ఇస్తారు? అని ప్రశ్నించారు దాసోజు. 
రాజ్యాంగ రక్షకులుగా ఉండాల్సినోళ్లు కేసీఆర్ కు బానిసలవుతున్నారు
'బ్యూరోక్రాట్లు రాజ్యంగానికి రక్షకులుగా వుండాలి.. చట్టానికి రక్షకులుగా వుండాలి, కానీ రాజ్యంగా రక్షకులుగా ఉండాల్సిన అధికారులు కేసీఆర్ కి బానిసలుగా మారిపోతున్నారు.. ఇది దుర్మార్గం. సీఎం కేసీఆర్ కి ఒక విజ్ఞప్తి. ప్రభుత్వాలు తాత్కాలికం. ఈ రోజు మీరు అధికారం ఉండొచ్చు. రేపు మరొకరు వస్తారు.  కానీ రాజ్యాంగం శాశ్వతం. తప్పుడు సాంప్రదాయాలు సృష్టించడం పద్దతి కాదు. విలువలతో ప్రభుత్వం నడపాలి. మీకు ఏమాత్రమైన నైతికత వుంటే కోర్టు ఆదేశాలని గౌరవిస్తూ జీవో 208ని వెనక్కి తీసుకోండి. 290 కోర్టు ధిక్కరణ కేసులు వున్న సీఎస్ ఆ పదవిలో వుండే అర్హత ఉందా ? వెంటనే సీఎస్ ని బర్త్ రఫ్ చేస్తూ విలువలు కలిగిన మరో అధికారిని ఆ పదవిలో నియమించండి'' అని దాసోజు శ్రవణ్ కోరారు.