ఉస్మానియా తరలింపుపై హెచ్‌‌‌‌ఎండీఏకు హైకోర్టు హెచ్చరిక

ఉస్మానియా తరలింపుపై హెచ్‌‌‌‌ఎండీఏకు హైకోర్టు హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా జనరల్‌‌‌‌ ఆస్పత్రిని గోషామహల్‌‌‌‌ స్టేడియానికి తరలించే వ్యవహారంలో వాయిదాల మీద వాయిదాలు తీసుకుంటూ కౌంటరు దాఖలు చేయని హెచ్‌‌‌‌ఎండీఏ తీరుపై హైకోర్టు సోమవారం అసహనం వ్యక్తం చేసింది. ఆఖరుసారిగా రెండు వారాల గడువు మంజూరు చేసింది. ఈ సారి కూడా కౌంటర్ దాఖలు చేయకపోతే జరిమానా విధించాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ విచారణను వాయిదా వేసింది. గోషామహల్‌‌‌‌ స్టేడియం స్థలాన్ని ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనం నిర్మాణం కోసం కేటాయిస్తూ ప్రభుత్వం జనవరిలో జారీ చేసిన జీవో 45ను సవాలు చేస్తూ జి. రాము అనే వ్యక్తి పిల్‌‌‌‌ దాఖలు చేసిన విషయం విదితమే. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌‌‌ అపరేశ్‌‌‌‌ కుమార్‌‌‌‌ సింగ్, జస్టిస్‌‌‌‌ జీఎం. 

మొహియుద్దీన్‌‌‌‌లతో కూడిన బెంచ్‌‌‌‌ సోమవారం విచారణ చేపట్టింది. కౌంటరు దాఖలు చేయడానికి రెండు వారాల గడువు కావాలని హెచ్‌‌‌‌ఎండీఏ తరఫు న్యాయవాది కోరగా పిటిషనర్‌‌‌‌ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేస్తూ హెచ్‌‌‌‌ఎండీఏ కౌంటరు దాఖలు చేయడానికి ఇప్పటికే పలు వాయిదాలు కోరిందన్నారు. వాదనలను విన్న ధర్మాసనం చివరగా ఒక అవకాశం ఇస్తున్నామని, ఈసారి దాఖలు చేయకపోతే జరిమానా విధిస్తామని హెచ్‌‌‌‌ఎండీఏను హెచ్చరిస్తూ విచారణను వాయిదా వేసింది.