
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని భూదాన్ భూముల వ్యవహారంలో జోక్యం చేసుకుంటే సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుందని మహేశ్వరం పోలీసులను హైకోర్టు హెచ్చరించింది. ఈ కేసులో పిటిషన్‌ను ఉపసంహరించుకోమని పిటిషనర్‌పై ఒత్తిడి చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. నాగారంలోని సర్వే నంబర్ 194లో తనకు చెందిన 10 ఎకరాల భూమి భూభారతిలో ఇతరుల పేరుతో నమోదైందని.. ఈ వ్యవహారంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పాత్ర ఉందని ఆరోపిస్తూ రాములు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ భూములపై అవకతవకలపై సీబీఐ, ఈడీలతో విచారణ జరిపించాలని కోరారు. అయితే, పిటిషన్ వేసినందుకు పోలీసులు మాత్రం తనను పోలీస్ స్టేషన్‌కు రావాలని ఫోన్ చేసి, అరెస్ట్ చేస్తామని బెదిరించారని రాములు మరో పిటిషన్ వేశాడు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కె. లక్ష్మణ్ మంగళవారం విచారణ చేపట్టారు. పోలీసుల హాజరుకు ఆదేశాలు జారీ చేయగా, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లుతో పాటు ఇతర పోలీసు అధికారులు కోర్టులో హాజరయ్యారు. పిటిషనర్‌కు ఫోన్ చేశారా, ఎవరి ఆదేశాలతో చేశారని కానిస్టేబుల్‌ను న్యాయమూర్తి ప్రశ్నించారు.
విలేజ్ హిస్టరీ రికార్డు నమోదులో భాగంగా ఎస్‌హెచ్‌ఓ ఆదేశాల మేరకు ఫోన్ చేశానని, పిటిషన్ ఉపసంహరణ గురించి చెప్పలేదని కానిస్టేబుల్ సమాధానం ఇచ్చారు. దీనిపై స్పందించిన జస్టిస్ కె. లక్ష్మణ్.. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పాత్ర ఉందంటూ జరుగుతున్న భూదాన్ భూముల వ్యవహారంలో పోలీసులు జోక్యం చేసుకోవడం సరికాదని, అలా చేస్తే సస్పెన్షన్‌కు ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ మేరకు పిటిషన్‌పై విచారణను మూసివేశారు.