ఆదిలాబాద్‌‌‌‌లో హైడ్రామా.. కాంగ్రెస్ లో చేరిన గంటలోపే బీజేపీలోకి

ఆదిలాబాద్‌‌‌‌లో హైడ్రామా.. కాంగ్రెస్ లో చేరిన గంటలోపే బీజేపీలోకి
  • కాంగ్రెస్‌‌‌‌లో చేరిన  బీజేపీ కౌన్సిలర్‌‌‌‌ రాజేశ్‌‌‌‌
  • ఆందోళనకు దిగిన బీజేపీ లీడర్లు, పోలీసుల లాఠీఛార్జ్‌‌‌‌
  • గంట సేపట్లోనే తిరిగి కాషాయ కండువా కప్పుకున్న కౌన్సిలర్‌‌‌‌

ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్‌‌‌‌ జిల్లా కేంద్రానికి చెందిన ఓ బీజేపీ కౌన్సిలర్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌లో చేరడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. చేరిక విషయం తెలుసుకున్న బీజేపీ లీడర్లు ఆందోళనకు దిగారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్‌‌‌‌ చేయాల్సి వచ్చింది. ఆందోళన జరిగిన గంట సేపట్లోనే సదరు కౌన్సిలర్‌‌‌‌ తిరిగి బీజేపీ గూటికి చేరడం గమనార్హం. వివరాల్లోకి వెళ్తే... ఆదిలాబాద్‌‌‌‌ పట్టణంలోని 25వ వార్డు బీజేపీ కౌన్సిలర్‌‌‌‌ పిన్నంవార్‌‌‌‌ రాజేశ్‌‌‌‌ ఆదివారం కంది శ్రీనివాస్‌‌‌‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌‌‌‌లో చేరారు.ఈ నెల 18న మున్సిపల్ వైస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌, కాంగ్రెస్‌‌‌‌ నేత జహీర్‌‌‌‌ రంజానీపై అవిశ్వాసం తీర్మానం ఉంది.

అయితే ఇప్పటికే పలువురు బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ కౌన్సిలర్లు కాంగ్రెస్‌‌‌‌లో చేరగా, తాజాగా బీజేపీకి చెందిన కౌన్సిలర్‌‌‌‌ను సైతం చేర్చుకోవడంతో బీజేపీ లీడర్లు ఆందోళనకు దిగారు. కంది శ్రీనివాస్‌‌‌‌రెడ్డి క్యాంప్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌ వద్దకు చేరుకొని తమ కౌన్సిలర్‌‌‌‌ను అక్రమంగా పార్టీలో చేర్చుకున్నారని, అతడిని వెంటనే బయటకు పంపించాలంటూ ధర్నా చేశారు.

విషయం తెలుసుకున్న డీఎస్పీ జీవన్‌‌‌‌రెడ్డి ఘటనాస్థలానికి వచ్చి నాయకులతో మాట్లాడినప్పటికీ వారు వినకపోవడంతో పోలీసులు, నాయకుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు పోలీస్‌‌‌‌ వాహనాన్ని ధ్వంసం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీజేపీ లీడర్లను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్‌‌‌‌ చేశారు. అనంతరం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానందం, పలువురు నాయకులను అరెస్ట్‌‌‌‌ చేసి స్టేషన్‌‌‌‌కు తరలించారు. 

గంటసేపట్లోనే తిరిగి బీజేపీలోకి...

కాంగ్రెస్‌‌‌‌లో చేరిన బీజేపీ కౌన్సిలర్‌‌‌‌ రాజేశ్‌‌‌‌ గంట సేపట్లోనే యూటర్న్‌‌‌‌ తీసుకున్నారు. తాను గాండ్ల సంఘానికి సంబంధించిన సమస్యలపై కంది శ్రీనివాస్‌‌‌‌రెడ్డితో మాట్లాడేందుకు వెళ్లానని, సమస్యలపై చర్చించిన అనంతరం వారు పార్టీలో చేర్పించుకున్నారని చెప్పారు. బయటకు వచ్చిన తర్వాత తన సొంత పార్టీ బీజేపీలో కొనసాగుతున్నట్లు ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ వీడే ప్రసక్తే లేదన్నారు.