కర్ణాటక అసెంబ్లీలో హైడ్రామా

కర్ణాటక అసెంబ్లీలో హైడ్రామా

కర్ణాటక రాజకీయాలు క్లైమాక్స్ కు చేరుకున్నాయి. బల పరీక్షపై జరిగిన చర్చలో కర్ణాటక సీఎం కుమారస్వామి తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. దీనిపై కాంగ్రెస్ నేతలు రియాక్ట్ అయ్యారు. కోట్ల కొద్ది డబ్బు ఎలా ఆఫర్ చేస్తామంటూ కుమారస్వామితో చెప్పారు. అదే సమయంలో తనకు బీజేపీకి చెందిన ముగ్గురు నేతలు 5 కోట్లు ఇవ్వజూపారని, జేడీఎస్ ఎమ్మెల్యే కె. శ్రీనివాస గౌడ అన్నారు. తన ప్రభుత్వాన్ని మొదటి నుంచి అస్థిర పరిచేందుకు ప్రయత్నించారని కుమార స్వామి ఆరోపించారు.

రెబెల్ ఎమ్మెల్యేలను బెంగళూరు, ముంబై, పుణెకు ఆటోరిక్షాలు తిప్పినట్టుగా బీజేపీ నేతలు తింపారని అన్నారు కుమారస్వామి. తనకు సీఎం కుర్చీపై ఆశ లేదని, కాంగ్రెస్ నేతలే సీఎం పదవి చేపట్టాలని కోరితే బాధ్యతలు తీసుకున్నానని గుర్తు చేసుకున్నారు. చర్చ జరగనివ్వాలని, తొందర ఏముందని ఒక దశలో బీజేపీ నేతలతో కుమార స్వామి అన్నారు. తాను అధికారాలను దుర్వినియోగం చేయబోనని, మీరు సోమ లేదా మంగళవారం ఎప్పుడైనా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు. గత రెండు వారాలుగా అన్ని వివాదాల్లో తనను లాగారని అన్నారు.

స్పీకర్ తీవ్ర విచారం

చర్చ సందర్భంగా కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ కేఆర్ రమేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన క్యారెక్టర్ పై నిందలు వేసే వారు వారి జీవితం గురించి ఆలోచించుకోవాలన్నారు. ఇతరుల్లాగా తన వద్ద లక్షలు కోట్లు లేవని, నిజాయితీగా బతికానని రమేష్ అన్నారు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే శక్తి తనకు ఉందని అన్నారు. బీజేపీ నేత, ఎంపీ శోభా కరంద్లాజే మైసూరులోని శ్రీ చాముండేశ్వరి దేవి టెంపుల్ లో ప్రత్యేక పూజలు చేశారు. యడ్యూరప్ప సీఎం కావాలని కోరుకుంటూ వెయ్యి మెట్లు ఎక్కారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీమంత్ పాటిల్ గైర్హాజరు

అటు కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీమంత్ పాటిల్ సభకు రాకపోవడంపై తీవ్ర చర్చ జరిగింది. ఆయన ముంబైలోని సెయింట్ జార్జ్ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. ఆయన కోసం కర్ణాటక పోలీసులు అక్కడికి చేరుకుని స్టేట్ మెంట్ తీసుకున్నారు. అదే విషయాన్ని కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ చెప్పారు. వ్యక్తిగత పనుల మీద చెన్నై వెళ్లినప్పుడు గుండెనొప్పి వచ్చిందని, దీంతో ముంబైలోని హాస్పిటల్ లో అడ్మిట్ అయినట్లు చెప్పారు. అందుకే  అసెంబ్లీకి హాజరు కావడం లేదని స్టేట్ మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం ఎమ్మెల్యే శ్రీమంత్ పాటిల్ కు కర్ణాటక, ముంబై పోలీసులు భద్రత కల్పిస్తున్నారు.