- రాత్రిపూట 9 గంటలపాటు ఆందోళనకారుల నిరసన
- ముందే తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని సీజేఐ ఫైర్
- సీబీఐ ఎంక్వైరీకి ఆదేశం.. కేంద్ర బలగాల మోహరింపు
- బెంగాల్లో ప్రతీది రాజకీయంగా మారుతున్నదని వ్యాఖ్య
కోల్కతా/న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా సమగ్ర సర్వే (ఎస్ఐఆర్) విధుల్లో ఉన్న ఏడుగురు జ్యుడీషియల్ అధికారులను మాల్దా జిల్లాలో బుధవారం ఆందోళనకారులు నిర్బంధించారు. సాయంత్రం 3:30 గంటలకు వారిని ఘెరావ్ చేశారు. అర్ధరాత్రి 1 గంట తర్వాత భద్రతా సిబ్బంది వారిని అక్కడి నుంచి సురక్షితంగా తీసుకువచ్చారు. దాదాపు 9 గంటలపాటు అధికారులను నిర్బంధంలో ఉంచారు. నిర్బంధానికి గురైన వారిలో ముగ్గురు మహిళా అధికారులు కూడా ఉన్నారు. అనంతరం అర్ధరాత్రి వారు వెళ్తుండగా వాహనాలపై కూడా రాళ్లు విసిరారు.
- బెంగాల్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
ఈ ఘటనపై సుప్రీంకోర్టు గురువారం తీవ్రంగా స్పందించింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘెరావ్ గురించి ముందే సమాచారం అందినా బెంగాల్ ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదని సుప్రీంకోర్టు మండిపడింది. సాయం కోసం కలకత్తా హైకోర్టు చీఫ్ జస్టిస్ స్వయంగా హోం సెక్రటరీకి, డీజీపీకి ఫోన్ చేయాల్సి వచ్చిందని సీజేఐ పేర్కొన్నారు. ఆదేశాలు అందినా జిల్లా అధికారులు ఘటనా స్థలానికి వెళ్లలేదని వివరించారు. ఈ ఘటన యాదృచ్ఛికంగా జరగలేదని, జ్యుడీషియల్ అధికారులను బెదిరించి సర్వే ఆపించాలనే పక్కా ప్లాన్ ప్రకారం చేశారని కోర్టు పేర్కొన్నది. ఇది న్యాయవ్యవస్థను సవాల్ చేయడమేనని, ఇకపై ఎవరినీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోనివ్వబోమని హెచ్చరించింది.
- కేంద్ర బలగాలు తక్షణమే మోహరించండి
ఈ కేసులో సుప్రీంకోర్టు కఠిన ఆదేశాలు జారీ చేసింది. జ్యుడీషియల్ అధికారుల రక్షణకు, సర్వే నిరాటంకంగా జరగడానికి కేంద్ర బలగాలను తక్షణమే మోహరించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ ఘటనపై సీబీఐ లేదా ఎన్ఐఏతో దర్యాప్తు చేయించాలని సూచించింది. నివేదికను నేరుగా సుప్రీంకోర్టుకే సమర్పించాలని చెప్పింది. బెంగాల్‌లో అందరూ రాజకీయ భాషే మాట్లాడుతున్నారని, ఇది దేశంలోనే ప్రతి అంశం రాజకీయంగా మారుతున్న రాష్ట్రమని చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు. అర్ధరాత్రి 2 వరకు తాను స్వయంగా పర్యవేక్షించాల్సి వచ్చిందని, ఇది చాలా దురదృష్టకరమని సీజేఐ అన్నారు.
- నాకు తెలియదు.. ఈసీదే బాధ్యత: మమత
మాల్దాలో జ్యుడీషియల్ అధికారులను నిర్బంధించడం అంతా బీజేపీ, ఈసీ కుట్రఅని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. గురువారం ఆమె సాగర్‌దీఘి సభలో మాట్లాడారు. ఈ ఘటన గురించి తనకు తెలియదని, బాధ్యులు ఎవరో అర్థం కావడం లేదన్నారు. ప్రస్తుతం పరిపాలన తన చేతుల్లో లేదన్నారు. ఎన్నికల సమయంలో శాంతి భద్రతలను ఎన్నికల సంఘమే నియంత్రిస్తుందన్నారు. ఎన్నికల సంఘం కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట వింటోందని, రాష్ట్ర అధికారులందరినీ మార్చేశారని ఆరోపించారు. ఈ ఘటన వెనక బీజేపీ, ఈసీ ఉందని ఆమె ఆరోపించారు. ఇందుకు ఈసీదే బాధ్యత అని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలను రద్దు చేయించి బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని ఆ పార్టీ కుట్రలు పన్నుతున్నదని వెల్లడించారు.
