మహబూబ్‌నగర్, వెలుగు : మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ముగిసింది. అధికార కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠాన్ని దక్కించుకున్నప్పటికీ, అభ్యర్థి ఎంపికలో అనుసరించిన వ్యూహాలు సొంత పార్టీ కార్పొరేటర్లలోనే తీవ్ర అసంతృప్తిని నింపాయి. మూడు రోజులుగా ‘సీల్డ్ కవర్’ పేరుతో అభ్యర్థి పేరును గోప్యంగా ఉంచి, చివరి నిమిషంలో ఎవరూ ఊహించని విధంగా గుమాల మమత పేరును తెరపైకి తేవడంపై విమర్శలు వస్తున్నాయి. భవిష్యత్ రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే కొందరు కీలక నేతలు ఈ ‘ట్రిక్స్’ ప్లే చేశారని నగరంలో చర్చ నడుస్తోంది. మేయర్ పీఠం బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో తొలి నుంచి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆనంద్ గౌడ్ సతీమణి ప్రసన్న పేరు ప్రముఖంగా వినిపించింది.
కార్పొరేటర్లంతా క్యాంపులో ఉన్న సమయంలోనే కొందరు నేతలు తమ వర్గీయుల పేర్లను లీక్ చేస్తూ గందరగోళం సృష్టించారు. ఆదివారం వరకు ప్రసన్న, రమాదేవి, హజీరా బేగం పేర్లు ప్రచారంలో ఉండగా, సోమవారం ఉదయానికి వాణిశ్రీ పేరు తెరపైకి వచ్చింది. తీరా ఎన్నికల సమయంలో సీల్డ్ కవర్ ఓపెన్ చేయగా, గుమాల మమత పేరు మేయర్‌గా ప్రకటించడంతో ఆశావహులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ప్రధానంగా పీఠంపై ఆశలు పెట్టుకున్న సీనియర్లకు మొండిచేయి చూపడం వెనుక అధిష్టానం వద్ద బలమైన ఒత్తిడి పనిచేసినట్లు తెలుస్తోంది.
ఈ ఎంపిక ప్రక్రియ క్యాంపులో ఉన్న నాయకుల మధ్య తీవ్ర విభేదాలకు దారితీసింది. ఆదివారం రాత్రి క్యాంపులో మంత్రులు, జాతీయ స్థాయి నేతల నుంచి వచ్చిన ఒత్తిళ్లను కాదని, స్థానిక నేత ఒకరు తాను సూచించిన వారికే పదవి ఇవ్వాలని పట్టుబట్టినట్లు సమాచారం. ఈ క్రమంలో ఒక కార్పొరేటర్ భర్తకు, ఇతర నేతలకు మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరిగినట్లు తెలిసింది. మేయర్ పదవి దక్కిన ఆనందం కంటే, అభ్యర్థి ఎంపికలో జరిగిన ఆధిపత్య పోరు కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది.
