వీడని ఫ్లోరైడ్ భూతం.. రక్తంలో పేరుకుపోతున్న ఫ్లోరైడ్.. యాదాద్రి జిల్లాలో కీళ్ల నొప్పులతో బాధపడ్తున్న జనం

వీడని ఫ్లోరైడ్ భూతం.. రక్తంలో పేరుకుపోతున్న ఫ్లోరైడ్.. యాదాద్రి జిల్లాలో కీళ్ల నొప్పులతో బాధపడ్తున్న జనం
  • బీబీనగర్ ఎయిమ్స్ స్టడీలో వెల్లడి
  • 119 మంది కీళ్లవాపు బాధితులపై అధ్యయనం
  • రక్తంలో అధికంగా పేరుకుపోతున్న ఫ్లోరైడ్
  • కీళ్లనొప్పుల బారిన పడుతున్నట్టు గుర్తింపు 
  • బాధితుల్లో 88 శాతం మంది మహిళలే
  • బోరు నీళ్లను నేరుగా తాగడమే కారణమంటున్న పరిశోధకులు

హైదరాబాద్, వెలుగు: ఫ్లోరైడ్ మహమ్మారి ప్రజలను ఇంకా పట్టిపీడిస్తూనే ఉంది. ఇన్నాళ్లూ దంతాలు, ఎముకలను వంకర్లు తిప్పిన ఫ్లోరైడ్.. ఇప్పుడు ప్రజల కీళ్లను పూర్తిగా దెబ్బతీస్తోందని బీబీనగర్‌‌లోని ఎయిమ్స్ చేసిన అధ్యయనంలో వెల్లడైంది. యాదాద్రి -భువనగిరి జిల్లాలో మోకాళ్ల నొప్పులతో (ఆస్టియో ఆర్థరైటిస్) బాధపడుతున్న 119 మందిపై ఎయిమ్స్ డాక్టర్లు పరిశోధన చేశారు. వీరంతా ఫ్లోరైడ్ ఉన్న బోరు నీళ్లను తాగడం వల్లే వారి కీళ్లు దెబ్బతింటున్నాయని అధ్యయనంలో వెల్లడైంది. ఇలాంటి నీళ్లు తాగేవారికి తీవ్రమైన కీళ్లవాతం వచ్చే ప్రమాదం.. మామూలు వారి కంటే 3.6 రెట్లు ఎక్కువగా ఉందని తేలింది.

2024  జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏడాది పొడవునా 40 నుంచి 60 ఏళ్ల వయస్సు ఉన్నవారిపై ఈ అధ్యయనం జరిగింది. మొత్తం 119 మంది బాధితుల్లో 105 మంది మహిళలే (88%) కావడం గమనార్హం. అంటే దాదాపు పది మంది బాధితుల్లో తొమ్మిది మంది మహిళలు ఉండటం ఈ సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది.

గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఎక్కువగా ఇంటి వద్దే ఉంటూ వంటకు, తాగడానికి స్థానికంగా దొరికే బోరు నీటినే వాడటం ఇందుకు ప్రధాన కారణంగా పరిశోధకులు భావిస్తున్నారు. అలాగే, వయసు పెరిగేకొద్దీ ఈ సమస్య మరింత తీవ్రమవుతోంది. ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన మహిళల్లో తీవ్రమైన కీళ్లవాతం వచ్చే ప్రమాదం దాదాపు మూడు రేట్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. 

శరీరంలో పేరుకుపోతున్న ఫ్లోరైడ్..
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం మనం తాగే లీటర్ నీటిలో 0.6 నుంచి 1.2 మిల్లీగ్రాముల ఫ్లోరైడ్ గాఢత స్థాయి ఉండొచ్చు. అధ్యయనంలో పేర్కొన్న ప్రకారం.. బాధితులు తాగే నీటిలో సగటు ఫ్లోరైడ్ గాఢత 0.1 mg/L మాత్రమే ఉంది. ఇది చూడడానికి తక్కువగా అనిపించినప్పటికీ, సమస్య ఇక్కడే మొదలవుతుంది. ఏండ్ల తరబడి అదే నీటిని తాగడం వల్ల.. ఆ ఫ్లోరైడ్ నెమ్మదిగా వాళ్ల శరీరంలోకి చేరుతోంది.

శరీరం ఆ ఫ్లోరైడ్‌‌‌‌ను పూర్తిగా బయటకు పంపలేకపోవడంతో అది ఎముకలు, కీళ్లలో పేరుకుపోతోంది. దీనినే ‘బయోఅక్యుమలేషన్’ అంటారు. బాధితుల సీరంలో సగటున ఫ్లోరైడ్ గాఢత 0.6 mg/L , మూత్రంలో సగటున 1.0 mg/L ఉన్నట్టు అధ్యయనంలో తేలింది. అంటే వారి రక్తం, మూత్రంలో సాధారణం కంటే ఎక్కువ మోతాదులో ఫ్లోరైడ్ ఉన్నట్టు వెల్లడైంది. ఇలా శరీరంలో పేరుకుపోయిన ఫ్లోరైడ్ వాళ్ల మోకాళ్లను దెబ్బతీసి, నొప్పులకు కారణమవుతోందని స్టడీలో తేలింది.  

శుద్ధి చేసిన నీళ్లు తాగితేనే మేలు.. 
వాతావరణ పరిస్థితుల కారణంగా ఏండ్లుగా లోతైనా బోర్లను తవ్సాల్సి వస్తోంది. ఇది అధిక ఫ్లోరైడ్ గాఢత ఉన్న భూగర్భ జలాలను బయటకు తెస్తోంది. 2024లో కేంద్ర ప్రభుత్వం చేసిన సర్వే ప్రకారం రాష్ట్రంలోని 1,150 భూగర్భ జలాల నమూనాలను పరిశీలించగా, వాటిలో 14.87% నమూనాల్లో ఫ్లోరైడ్ పరిమితిని మించి ఉంది. యాదాద్రి-భువనగిరి జిల్లాలో 48.84% నమూనాల్లో ఫ్లోరైడ్ స్థాయిలు ప్రమాదకరంగా ఉన్నట్లు తేలింది.

ఇక ఎయిమ్స్ అధ్యయనంలో పాల్గొన్న వారిలో 82 శాతానికి పైగా ప్రజలు శుద్ధి చేయని బోరు నీళ్లనే నేరుగా తాగుతున్నట్లు తేలింది. కేవలం కొద్దిమంది మాత్రమే ఆర్వో ఫిల్టర్లను వాడుతున్నారు. శుద్ధి చేసిన నీటిని తాగిన వారిలో మోకాళ్ల నొప్పులు తక్కువగా ఉన్నాయని అధ్యయనం పేర్కొంది. ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు తప్పనిసరిగా శుద్ధి చేసిన నీటినే తాగాలని పరిశోధకులు సూచిస్తున్నారు.