దమ్మాయిగూడలో ఉద్రిక్తత.. అంబులెన్స్ అడ్డుకున్న స్థానికులు

దమ్మాయిగూడలో ఉద్రిక్తత.. అంబులెన్స్  అడ్డుకున్న స్థానికులు

దమ్మాయిగూడలో ఉద్రిక్తత నెలకొంది. అంబేద్కర్ నగర్ కు బాలిక డెడ్ బాడీ తరలించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే అంబులెన్స్ ను అడ్డుకున్న స్థానికులు.. అంబేద్కర్ నగర్ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. పోస్టుమార్టం రిపోర్టులో ఏముందో చెప్పడంతో పాటు ఘటన ఎలా జరిగిందో క్లియర్ గా చెప్పేంతవరకు అంబులెన్సును కదలనివ్వమని రోడ్డుపై బైఠాయించారు. బాలిక కుటుంబానికి న్యాయం చేసేవరకు మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. అయితే పోలీసులు బాలిక కుటుంబ సభ్యులను డైవర్ట్ చేసి మరో మార్గంలో మృతదేహాన్ని తరలించే ప్రయత్నం చేయడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు పోలీసు వాహనంపై రాళ్లతో దాడికి ప్రయత్నించారు.

ఇదిలా ఉంటే దమ్మాయిగూడ బాలిక మృతదేహానికి పోస్ట్ మార్టం ముగిసింది.  డాక్టర్లు ఇచ్చిన ప్రాథమిక నివేదిక ప్రకారం బాలిక శరీరంపై ఎటువంటి  గాయాలు లేవని తేల్చారు. చిన్నారి ఊపిరితిత్తుల్లో నీరు చేరినట్లు గుర్తించారు. చెరువులో పడి నీరు మింగడం వల్లే బాలిక చనిపోయినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే బాలికను ఎవరైనా చెరువులో తోసేశారా..?.. లేక తనే ఆడుకుంటూ చెరువులో పడిందా అనేది తేలాల్సి ఉంది. నిబంధనల మేరకు గాంధీ హాస్పిటల్ డాక్టర్ల బృందం పంచనామా, పోస్ట్ మార్టం పూర్తి చేసింది. నాలుగు పేజీలు..22 కాలమ్స్ లో పంచనామా వివరాలు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు బాలిక డెడ్ బాడీని అప్పగించారు పోలీసులు.