- పీఎస్‌లో ఆత్మహత్యకు యత్నించిన యువకుడు మృతి
- పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించిన బంధువులు
- ఐదు గంటలకు పైగా ఆందోళన, బారికేడ్లు ధ్వంసం
- ఉద్రిక్తత మధ్యే యువకుడి అంత్యక్రియలు
పాలకుర్తి, వెలుగు : జనగామ జిల్లా పాలకుర్తిలో శనివారం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. శుక్రవారం పోలీస్‌స్టేషన్‌లో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించిన మేకలతండాకు చెందిన శ్రీను (21) వరంగల్ ఎంజీఎంలో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ శనివారం ఉదయం చనిపోయాడు. దీంతో మృతుడి బంధువులు, తండావాసులు పాలకుర్తి పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించారు. శ్రీను మృతికి కారణమైన వారిని అరెస్ట్ చేయాలని, ఎస్సై, సీఐలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
వందలాదిగా తరలివచ్చిన బంధువులు, పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు తరలివచ్చి శ్రీను మృతికి కారణమైన వారిని తమకు చూపించాలని డిమాండ్ చేస్తూ స్టేషన్‌లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. బారికేడ్లను ధ్వంసం చేయడమే కాకుండా పోలీసులతో వాగ్వాదం, తోపులాటకు దిగారు. సుమారు ఐదు గంటల పాటు ఆందోళన కొనసాగింది. ఆగ్రహానికి గురైన వారు మహిళలు పోలీసులను నెట్టి వేస్తూ బారికేడ్లను రోడ్డుపైకి తీసుకొచ్చి ధ్వంసం చేశారు. స్టే
షన్‌లోకి దూసుకొచ్చే క్రమంలో అడ్డుకున్న లేడీ కానిస్టేబుళ్లపై మహిళలు చేయిచేసుకున్నారు. ట్రాలీ వాహనాలను రోడ్డుకు అడ్డంగా పెట్టి నిరసన తెలిపారు. సుమారు ఐదు గంటల పాటు ఆందోళన కొనసాగింది. పరిస్థితి అదుపు తప్పడంతో విషయం తెలుసుకున్న జనగామ డీసీసీ రాజమహేంద్ర నాయక్ పాలకుర్తి చేరుకొని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు.
శ్రీను డెడ్‌బాడీని అక్కడే దహన చేస్తామంటూ చితిని సైతం పేర్చారు. పోలీసులు వరంగల్ కమిషనరేట్ నుంచి అదనపు బలగాలను రప్పించి భారీ బందోబస్తు నిర్వహించారు.
అంబులెన్స్‌ను న్సు దారి మళ్లించాలని పట్టు
ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు పోలీస్‌స్టేషన్ ముందు ఆందోళన కొనసాగించిన గ్రామస్తులు శ్రీను డెడ్‌బాడీ వస్తుందని చెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అంబులెన్స్‌ను మృతుని స్వగ్రామం మేకల తండాకు కాకుండా అతడి భార్య ఊరైన నర్సింగాపూరంతండాకు గానీ, పాలకుర్తి పోలీస్‌స్టేషన్‌కు గానీ, శ్రీను సూసైడ్‌కు కారణమైన దుబ్బతండాకు చెందిన హుస్సేన్ ఇంటికి గానీ తీసుకెళ్తారని ప్రచారం జరిగింది. దీంతో పోలీసులు మూడు ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు.
అంబులెన్స్ బమ్మెర పెద్దతండాకు చేరుకోగానే డీసీపీ రాజమహేంద్రనాయక్ బాధిత కుటుంబాలతో చర్చలు జరిపారు. మృతుని కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే ఆరుగురు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని చెప్పారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని నచ్చజెప్పారు. అనంతరం భారీ పోలీస్ బందోబస్త్ నడుమ మేకలతండాలో శ్రీను అంత్యక్రియలు చేయడంతో ఆందోళన సద్దుమణిగింది.
మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
శ్రీను మృతి విషయం తెలుసుకున్న పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి ఎంజీఎంకు వెళ్లి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝాతో ఫోన్‌లో మాట్లాడి, ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సైతం మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు.