నిర్మల్ జిల్లా కడెం మండలంలో ఉద్రిక్తత..భారీగా పోలీసుల మోహరింపు

నిర్మల్ జిల్లా కడెం మండలంలో ఉద్రిక్తత..భారీగా పోలీసుల మోహరింపు

నిర్మల్ జిల్లా కడెం మండలం మైసంపేట్ పునరావాస కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పునరావాస గ్రామస్తులకు కేటాయించిన వ్యవసాయ భూములకు రెవెన్యూ అధికారులు హద్దులు చూపిస్తుండగా... నచ్చన్ ఎల్లాపూర్ గోండుగూడ గిరిజనులు ఒక్కసారిగా దానికి అడ్డుపడ్డారు. తమ గ్రామ గిరిజనులకు ముందుగా భూములు కేటాయించిన తర్వాతే, ఇతరులకు హద్దులు చూపించాలంటూ అధికారులను నిలదీశారు. అధికారుల వాహనాలకు అడ్డంగా నిలబడి గిరిజనులు పెద్ద పెట్టున ఆందోళనకు దిగడంతో అక్కడ ఉత్కంఠ వాతావరణం నెలకొంది.

ఆందోళన ఉధృతం కావడంతో రంగంలోకి దిగిన అటవీశాఖ, పోలీస్ అధికారులు గిరిజనులను చెల్లాచెదురు చేశారు. ప్రభుత్వ పనులకు ఆటంకం కలిగిస్తున్నారనే నెపంతో... దాదాపు 20 మంది ఆందోళనకారులను అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ పోలీస్ వాహనాల్లో ఇంధన్‌పల్లి రేంజ్ కార్యాలయానికి తరలించారు.

ఆందోళనకారులను తరలించిన అనంతరం... భారీ భద్రత నడుమ అధికారులు హద్దుల ప్రక్రియను ప్రారంభించారు. ఎఫ్‌డీవో (FDO) శివకుమార్, సీఐలు సత్యనారాయణ, సమ్మయ్య ఆధ్వర్యంలో... దాదాపు 150 మంది పోలీస్, అటవీశాఖ అధికారులు, సిబ్బంది అక్కడ భారీగా మోహరించారు. ఈ గట్టి బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారులు మైసంపేట్ పునరావాస గ్రామస్తులకు కేటాయించిన భూములను జేసీబీలతో చదును చేస్తూ, హద్దులు ఏర్పాటు చేసే ప్రక్రియను కొనసాగిస్తున్నారు. గిరిజనుల ఆగ్రహం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మైసంపేట్ పరిసర ప్రాంతాల్లో నిఘా పెట్టారు.