ఏ లెక్కన కూలుస్తరు? సర్కారును నిలదీసిన హైకోర్టు

ఏ లెక్కన కూలుస్తరు? సర్కారును నిలదీసిన హైకోర్టు

హెరిటేజ్ జాబితాలోంచి తొలగించినంత మాత్రాన చారిత్రక కట్టడాలు కావా?

చట్టానికి ఎవరూ అతీతులు కారని కామెంట్​

హెరిటేజ్​ జాబితాలోంచి తొలగించినంత మాత్రాన ఎర్రమంజిల్​భవనాలు చారిత్రక కట్టడాలు కాకుండా పోతాయా? ప్రభుత్వ ఆధీనంలో ఉన్నంత మాత్రాన కూల్చే హక్కు వస్తుందా? ఎల్లోరా, అజంతా గుహలు కూడా సర్కారువేనని చెప్పి వాటిని కేంద్ర ప్రభుత్వం కూల్చేస్తామంటే ఒప్పుకుంటామా? – రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న

హైదరాబాద్‌‌: ‘హెరిటేజ్​ జాబితాలోంచి తొలగించినంత మాత్రాన ఎర్రమంజిల్​భవనాలు చారిత్రక కట్టడాలు కాకుండా పోతాయా? ప్రభుత్వ ఆధీనంలో ఉన్నంత మాత్రాన కూల్చే హక్కు వస్తుందా? ఏ లెక్కన కూలుస్తరు? ఎల్లోరా, అజంతా గుహలూ సర్కారువేనని కేంద్రం కూల్చేస్తామంటే ఒప్పుకుంటామా?’ అంటూ హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసింది. ఎర్రమంజిల్‌‌లో కొత్త అసెంబ్లీ నిర్మాణం కోసం అక్కడున్న పురాతన భవనాలను కూల్చివేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌‌ చేస్తూ దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలపై సీజే జస్టిస్‌‌ ఆర్ఎస్‌‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌‌ షమీమ్‌‌ అక్తర్‌‌లతో కూడిన బెంచ్‌‌ ఎదుట  బుధవారం వాదనలు కొనసాగాయి.

ఎర్రమంజిల్‌‌ బిల్డింగ్‌‌ను పురాతన భవనాల జాబితా నుంచి తొలగిస్తూ జీవో వెలువడినా దాని నిర్వహణ, రక్షణ బాధ్యత ప్రభుత్వానిదే అవుతుందని బెంచ్‌‌ వ్యాఖ్యానించింది. హుడా యాక్ట్‌‌ ప్రకారం చాలాకాలం అది హెరిటేజ్‌‌ బిల్డింగ్‌‌గానే ఉందనీ, 2015లో జీవో 13 ద్వారా తొలగించినా నిర్వహణ, రక్షణ బాధ్యత ప్రభుత్వానిదే అవుతుందని బెంచ్‌‌ స్పష్టం చేసింది. హెరిటేజ్‌‌ యాక్ట్‌‌ నిబంధన 6, రాష్ట్ర చట్టంలోని నిబంధన 5 ప్రకారం ఎర్రమంజిల్‌‌ బిల్డింగ్‌‌ నిర్వహణ బాధ్యత ఎవరిదో ప్రభుత్వం తెలియజేయాలని బెంచ్‌‌ కోరింది.

విచారణలో తొలుత పిటిషనర్ల తరఫు లాయర్‌‌ నిరూప్‌‌రెడ్డి వాదించారు. ఎలాంటి అవసరం లేకపోయినా కొత్తగా అసెంబ్లీ భవనాలను నిర్మించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోందని, దీని వల్ల కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందన్నారు. తర్వాత ప్రభుత్వం తరఫున ఏఏజీ జె.రామచందర్‌‌రావు వాదించారు. ప్రస్తుత అసెంబ్లీ భవనం అవసరాలకు సరిపోవడం లేదని, పార్కింగ్‌‌ చోటు లేదని, భద్రతాపరంగా యోగ్యమైనది కాదని వాదించారు. ఎర్ర మంజిల్‌‌ చారిత్రక కట్టడం కాదని, ఆ జాబితాలోంచి ప్రభుత్వం తొలగించినదని చెప్పారు. అయితే ఒకసారి పరిరక్షణ కట్టడాల పరిధిలోకి వచ్చాక వాటిని కాపాడాల్సిందేనని బెంచ్​ స్పష్టం చేసింది. కాగా.. టీఆర్ఎస్‌‌ తరఫున ఎమ్మెల్సీగా గెలిచిన భూపతిరెడ్డిపై మండలి చైర్మన్‌‌ అనర్హత వేటు వేయడం రాజ్యాంగబద్ధమేనని హైకోర్టు స్పష్టం చేసింది.