బడి సదువుకు బండెడు ఫీజులు

బడి సదువుకు బండెడు ఫీజులు

ఇన్నాళ్లూ పిల్లలు కాలేజీకి వెళితే ఫీజులకు పైసలెట్లాగనే టెన్షన్​ఉండేది. ఇప్పుడు బడిలో వేయాలన్నా భయమే. ఎల్​కేజీ చదువుకే వేలకు వేలు ఫీజులు. కొన్ని స్కూళ్లలో అయితే లక్ష రూపాయలూ చాలట్లేదు. ఇంటికి దగ్గర్లో ఉన్న చిన్న స్కూలు నుంచి కార్పొరేట్​ బడుల దాకా అడ్డగోలు వసూళ్లే. ఒక్కో క్లాస్​పెరుగుతున్న కొద్దీ.. ఫీజుల మోత పెరుగుతూనే పోతోంది. ఇలా ఇష్టారాజ్యంగా జరుగుతున్న వసూళ్లకు కళ్లెం వేసేందుకు గతంలో ఇచ్చిన జీవోలు అమలు కావడం లేదు. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా సర్కారు స్పందించడం లేదేమని పేరెంట్స్​ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పది రోజుల్లో బడులు ఖుల్లా..

రాష్ట్రంలో మొత్తం 41 వేల స్కూళ్లు ఉండగా.. వాటిలో 59 లక్షల మందికి పైగా స్టూడెంట్లు ఉన్నారు. ఇందులో 12 వేల ప్రైవేటు స్కూళ్లలో 30 లక్షల మంది వరకు ఉన్నారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి మరో పదిరోజులే ఉంది. పిల్లల్ని కొత్తగా స్కూళ్లో వేసేవారు ఓవైపు, పైతరగతిలో చేరేందుకు పెరిగిన ఫీజులు కట్టేందుకు మరోవైపు పేరెంట్స్​లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రైవేటు స్కూళ్లలో ఎల్​కేజీకే రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు వసూలు చేస్తున్నారు. కార్పొరేట్​ స్కూళ్లలో అయితే రూ.2 లక్షల వరకు తీసుకుంటున్నారు. కనీస వసతులు లేకపోయినా ఇష్టారాజ్యంగా దండుకుంటున్నారు. ఇలా హద్దూ అదుపులేని ఫీజులకు కళ్లెం వేసేందుకు గతంలో ప్రభుత్వాలు జీవో 91, జీవో 42ను తీసుకొచ్చాయి. కానీ ప్రైవేటు స్కూళ్ల మేనేజ్​మెంట్లు ఏదో ఒక సాకు చెబుతూ..  కోర్టుల ద్వారా ఆ జీవోల అమలును అడ్డుకున్నాయి. ఇక జీవో–1 అమలవుతోందని చెబుతున్నా ఎక్కడా ఆ దాఖలాల్లేవు.

ఆ జీవోల్లో ఏముంది?

ప్రైవేటు బడుల్లో ఫీజుల కట్టడి కోసం 2009లో ఉమ్మడి ఏపీ సర్కారు జీవో 91ను తీసుకొచ్చింది. రాష్ట్ర స్థాయిలో ఫీజుల నియంత్రణ కమిటీ, జిల్లాల్లో కలెక్టర్‌‌ నేతృత్వంలోని జిల్లా ఫీజుల నియంత్రణ కమిటీ (డీఎఫ్ఆర్​సీ) వేయాలని.. వాటి ద్వారా ఫీజులను నిర్ణయించాలని పేర్కొంది. ఒకసారి నిర్ణయించిన ఫీజులను మూడేళ్లు కొనసాగించాలని, తర్వాత సవరించాలని సూచించింది. ఐఐటీ ఒలింపియాడ్‌‌, కాన్సెప్ట్​, ఈ-టెక్నో పేర్లను పెట్టొద్దని, వాటి పేర అదనపు ఫీజులు వసూలు చేయొద్దని స్పష్టం చేసింది. అయితే దీనిపై స్కూళ్ల మేనేజ్​మెంట్లు హైకోర్టుకు వెళ్లడంతో.. ఫీజులను ప్రభుత్వమే నిర్ణయించాలని, ఆ కమిటీలకు అధికారం ఉండదని తీర్పు వచ్చింది. తర్వాత విద్యా హక్కు చట్టం అమల్లోకి రావడంతో ఫీజుల నియంత్రణ కోసం 2010లో జీవో 42ను తీసుకొచ్చారు. ప్రైమరీ, అప్పర్‌‌ ప్రైమరీ (ఏడో తరగతి) వరకు గ్రామీణ ప్రాంతాల్లో రూ.7,800 వరకు, పట్టణ ప్రాంతాల్లో రూ.9 వేల వరకు ఫీజు వసూలు చేసుకోవచ్చని.. హైస్కూళ్లకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో రూ.10,800 వరకు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేల వరకు తీసుకోవచ్చని ఆ జీవోలో పేర్కొంది. అయితే స్కూళ్లకు కామన్​ ఫీజు అమలు సాధ్యం కాకపోవడంతో ఇదీ అమల్లోకి రాలేదు.

కమిటీ నివేదిక ఇచ్చినా..

ఫీజుల నియంత్రణ కోసం 2017 మార్చిలో ఓయూ ప్రొఫెసర్‌‌ తిరుపతిరావు నేతృత్వంలో సర్కారు  కమిటీని వేసింది. అదే ఏడాది డిసెంబర్​31న కమిటీ రిపోర్టు ఇచ్చింది. దానికి అనుగుణంగా ప్రభుత్వం చట్టం తీసుకొస్తుందని భావించినా జరగలేదు. కానీ 2017–-18లో ఉన్న ఫీజులనే 2018–19లోనూ వసూలు చేయాలని స్టేటస్​కో ఆర్డర్​ జారీ చేసింది. మేనేజ్​మెంట్లు కోర్టుకు వెళ్లడంతో హైకోర్టు స్టేటస్​కోను ఎత్తివేసింది. పెంచే ఫీజుల కోసం కొత్త అకౌంట్ ఓపెన్​చేసి అందులో డబ్బు జమ చేయాలని ఆదేశించింది. ఆ తర్వాత ఎలాంటి కదలికా లేదు.

జీవో–1 అమలయ్యేనా?

ప్రైవేటు బడుల అనుమతి, నిర్వహణ, ఫీజులు వంటి ప్రతి విషయం జీవో–1 ప్రకారమే జరగాలి. ఫీజుల వసూళ్లపై అందులో స్పష్టత లేకున్నా.. వసూలు చేసిన ఫీజులను ఎలా వాడాలన్న రూల్స్​ ఉన్నాయి. ఫీజుల సొమ్ములో 50 శాతం టీచర్ల జీతాలకు, మరో 15% టీచర్ల పీఎఫ్, ఈఎస్​ఐ, బీమా వంటి వాటికి ఖర్చు చేయాలి. 15% సొమ్ము పాఠశాల నిర్వహణకు, 15% అభివృద్ధికి ఖర్చు చేయాలి. అన్నిపోగా మిగిలిన ఐదు శాతాన్ని మాత్రమే లాభంగా తీసుకోవాలి. కానీ ఈ రూల్స్​ అమలుకావడం లేదు.

తిరుపతిరావు కమిటీ సిఫార్సుల్లో కొన్ని..

  • స్కూల్​ మేనేజ్​మెంట్లు ఫీజులు, ఆదాయం, ఖర్చు వివరాలను విద్యాశాఖ వెబ్​సైట్లో పెట్టాలి. అలా లెక్కలివ్వని బడుల గుర్తింపును రద్దు చేయాలి.
  • ఫీజుల వసూలు, జీతాల చెల్లింపులు, ఖర్చులు అన్నీ ఆన్​లైన్​లోనే చేయాలి.
  • బడుల్లో ఎలాంటి వ్యాపార సంబంధ (పుస్తకాలు, డ్రెస్సులను అమ్మడం) కార్యక్రమాలు నిర్వహించొద్దు.
  • ఫీజును ఏటా 10% పెంచుకునే అవకాశం. అది కూడా ఫీజుల కమిటీ సూచించి అనమతిస్తేనే ఉండాలి. తప్పుడు లెక్కలిస్తే విచారించి స్కూళ్ల గుర్తింపు రద్దు చేయొచ్చు.
  • విద్యా సంస్థలను లాభాపేక్షతో నిర్వహించొద్దు. జీవో 1 ప్రకారం.. అనుమతించిన ఐదు శాతం లాభాన్నీ మేనేజ్​మెంట్లు తీసుకోవద్దు.
  • ఫీజుల నియంత్రణ కోసం రాష్ట్ర స్థాయిలో రెండు కమిటీలను ఏర్పాటు చేయాలి.