శ్రీవారి టికెట్ల పేరుతో మోసాలు : తిరుమల దర్శనానికి వచ్చి షాక్ అయిన కుటుంబం.. ఒరిజినల్ లాగే ఉన్న నకిలీ టికెట్లు

శ్రీవారి టికెట్ల పేరుతో మోసాలు : తిరుమల దర్శనానికి వచ్చి షాక్ అయిన కుటుంబం.. ఒరిజినల్ లాగే ఉన్న నకిలీ టికెట్లు

కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీవారి టికెట్ల పేరుతో జరుగుతున్న మోసాలు పెరిగిపోతున్నాయి. శ్రీవారి దర్శనం టికెట్ల పేరుతో భక్తులను నిలువునా దోచుకుంటున్నారు మోసగాళ్లు. ఇవాళ ( జులై 3 ) మరో నకిలీ టికెట్ల మోసం వెలుగులోకి వచ్చింది. శ్రీవారి తోమాల టికెట్ల పేరుతో జరిగిన ఘరానా మోసం బయటపడింది. శ్రీవారి తోమాల టికెట్ల పేరుతో ఓ కుటుంబం నుంచి రూ. 65 వేలు రాబట్టాడు దళారీ. కుటుంబం నుంచి డబ్బులు వసూలు చేసిన మోసగాడు నకిలీ టికెట్లు అంటగట్టాడు. దళారీ చేతిలో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. 

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుని తోమాల సేవ, అభిషేక సేవలు తనివి తీరా చూడాలని భావించిన కుటుంబం దళారీ మోసానికి బలయ్యింది.. టికెట్ల కోసం ముందుగా దళారీకి డబ్బులు చెల్లించి తీరా కొండకు చేరుకున్న తర్వాత తాము నీకిలి టికెట్లు కొని మోసపోయామని గ్రహించారు బాధితులు.పది రోజుల ముందే ఒక వ్యక్తి మొబైల్ నుండి వచ్చిన  తోమాల, అభిషేక సేవా టికెట్లను తమ ఫోన్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే క్రమంలో అవి నకిలీవి అని తేలడంతో విస్తు పోయారు బాధితులు.వెంటనే తిరుమల వన్ టౌన్ పోలీసులకు  ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా... ఎక్కడైతే మొబైల్ ట్రాన్సాక్షన్  చేశారో ఆ పరిధి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలని చెప్పారు పోలీసులు. 

తెలంగాణలోని సిరిసిల్లకు చెందిన విజయ్ అనే ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగి తన మిత్రుడి ద్వారా బాలాజీ అనే దళారీ నంబరు పొందాడు. బాలాజి కోరిన దర్శనం చేయిస్తాడని చెప్పడంతో అతనిని సంప్రదించి పలు దఫాలుగా రూ. 65 పంపాడు. అందుకు పది రోజుల క్రితం విజయ్ కుటుంబ సభ్యులు ఐదు మంది పేర్లతో టీటీడీ లోగో కలిగిన నకిలీ తోమాల సేవ టికెట్లను నెట్ లో తయారు చేసి.. విజయ్ మొబైల్ కి పంపాడు బాలాజీ. 

స్వామివారి తోమాల సేవలో పాల్గొనేందుకు బుధవారం ( జులై 2 ) కుటుంబంతో కలిసి తిరుమలకు చేరుకున్నారు విజయ్.ఎందుకైనా మంచిదే అని తిరుపతిలో ఉచిత టైమ్ స్లాట్ టోకెన్లు కూడా తీసుకున్నారు బాధితులు. దర్శనానికి వెళ్లే ముందు బాలాజీకి ఫోన్ చేయగా అతను లిఫ్ట్ చేయకపోగా మెసేజ్ లకు కూడా స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. రెఫరెన్స్ లేకుండా దర్శనం టికెట్ మంజూరు కాదని.. ఎంతటి వీఐపీ అయినా ప్రోటోకాల్ పరిధిలో ఉన్నవారు స్వయంగా వస్తేనే తోమాల  లేదా ఇద్దరికి మాత్రమే టికెట్లు మంజూరు చేస్తారని తెలిపారు సిబ్బంది.దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు చేసేదేమీ లేక స్వామివారి ఉచిత దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం అయ్యారు. 

దళారీలు శ్రీవారి భక్తులను మోసం చేసేందుకు రక రకాల కొత్త మార్గాలను ఉపయోగించి దోచేస్తున్నారని..  ఇటువంటి మోసాలపై ఇటు టీటీడీ, అటు పోలీసులు బయట వ్యక్తులను నమ్మకండి... టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారానే దర్శనం టికెట్లను బుక్ చేసుకోవాలని పదే పదే కోరుతున్నప్పటికీ తరచూ ఇలాంటి ఘటనలతో భక్తులు మోసపోతూనే ఉన్నారు. కాగా నకిలీ టికెట్లతో భక్తులను మోసం చేసిన బాలాజీ బ్యాంక్ అకౌంట్ కడప జిల్లా ఒంటిమిట్టలో ఉన్నట్లు తెలిపాడు బాధితుడు.