Hockey Asia Cup: ఆసియా కప్‌లో పాకిస్థాన్ ఆడతానంటే అడ్డుకోము: భారత క్రీడా మంత్రిత్వ శాఖ

Hockey Asia Cup: ఆసియా కప్‌లో పాకిస్థాన్ ఆడతానంటే అడ్డుకోము: భారత క్రీడా మంత్రిత్వ శాఖ

భారత్ వేదికగా హాకీ ఆసియా కప్ ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 7 వరకు బీహార్‌లో జరగనుంది. ఈ టోర్నమెంట్‌లో పాల్గొనే జట్లలో పాకిస్తాన్ ఒకటి. భారత్, పాకిస్థాన్ సరిహద్దు ఉద్రిక్తల నేపథ్యంలో నిన్నటివరకు పాకిస్థాన్ ఈ టోర్నీలో ఆడదేమో అనే అనుమానాలు నెలకొన్నాయి. అయితే పాకిస్థాన్ జట్టును ఆసియా కప్ లో ఆడకుండా తాము అడ్డుకోమని భారత క్రీడా మంత్రిత్వ శాఖ చెప్పుకొచ్చింది.

"వరల్డ్ కప్, ఆసియా కప్ లాంటి పెద్ద టోర్నీల్లో పాకిస్థాన్ పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. పాక్ ఆడతామంటే మేము వ్యతిరేకించం. వారు ఆడకుండా వారిని అడ్డుకోము.  ఇది ద్వాపక్షిక సిరీస్ కాదు. అంతర్జాతీయ క్రీడలు పోటీ నుండి మనం వెనక్కి తగ్గకూడదని డిమాండ్ చేస్తున్నాయి. రష్యా మరియు ఉక్రెయిన్ యుద్ధంలో ఉన్నాయి. కానీ అవి బహుళ జాతీయ ఈవెంట్లలో ఆడుతూ కనిపిస్తాయి" అని క్రీడా మంత్రిత్వ శాఖ వర్గాలు గురువారం (జూలై 3) తెలిపాయి. పాకిస్తాన్ హాకీ జట్టు చివరిసారిగా ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ కు 2023లో ఇండియాకు వచ్చింది. 

ALSO READ | IND VS ENG 2025: కెప్టెన్ ఒంటరి పోరాటం: గిల్ భారీ సెంచరీ.. 400 పరుగులు దాటిన టీమిండియా

ఆసియా కప్ విషయానికొస్తే.. ఇండియా, పాకిస్తాన్‌తో సహా మొత్తం 8 జట్లు పాల్గొననున్నాయి. ఆతిథ్య దేశంగా ఇండియా ఈ  టోర్నమెంట్‌కు అర్హత  సాధించింది. మిగిలిన ఐదు జట్లు - చైనా, జపాన్, మలేషియా, పాకిస్తాన్, దక్షిణ కొరియా ఈ మెగా టోర్నీలో పాల్గొననున్నాయి. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో జరిగిన AHF కప్ ఫైనల్‌కు చేరుకున్న ఒమన్, చైనీస్ తైపీ ఈ టోర్నమెంట్‌కు అర్హత సాధించాయి. ఈ టోర్నమెంట్ విజేత వచ్చే ఏడాది జరగనున్న మెన్స్ హాకీ ప్రపంచ కప్‌కు అర్హత సాధిస్తుంది. దీంతో ఈ టోర్నీని అన్ని జట్లు సీరియస్ గా భావిస్తున్నాయి.  

2022లో జరిగిన ఆసియా కప్‌లో దక్షిణ కొరియా ఐదవసారి రికార్డు స్థాయిలో గెలిచింది. మలేషియా రన్నరప్‌గా నిలవగా, జపాన్‌ను ఓడించి భారత్ మూడవ స్థానంలో నిలిచింది. ఆసియా కప్ చరిత్రలో ఇండియా మూడుసార్లు ఆసియా కప్‌ను గెలుచుకుంది. 2017లో చివరిసారిగా  మలేషియాను ఓడించి ఆసియా కప్ గెలుచుకుంది.