
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్ తీవ్ర కలకలం రేపిన సంగతి మీకు తెలిసిందే. అయితే ఈ కేసులో పోలీసులు మరో విషయాన్నీ ఛేదించారు. అరెస్టయిన ఉగ్రవాదుల సతీమణులను తాజాగా పోలీసుల అదుపులో తీసుకున్నారు. పలు బాంబు పేలుళ్ల కేసుల్లో నిందితులుగా ఉన్న అబుబక్కర్ సిద్ధిఖీ, మహమ్మద్ ఆలీ అనే సోదరులు మారుపేర్లతో కొన్ని ఏళ్లుగా రాయచోటిలో చీరల వ్యాపారం నిర్వహిస్తూ రహస్యంగా గడుపుతున్నారు. ఇప్పటికే వీరిని అరెస్ట్ చేసిన NIA అధికారులు చెన్నై తరలించి కోర్టులో ప్రవేశపెట్టారు. గతంలో రాయచోటిలో 25 ఏళ్ళుగా నివాసం ఉంటూ స్థానికులుగా చలామణి అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
పోలీసుల కథనం ప్రకారం రాయచోటికు చెందిన మహిళను అబుబక్కర్ సిద్ధిఖీ వివాహం చేసుకోగా, సుండుపల్లి కు చెందిన మహిళను మహమ్మద్ అలీ వివాహం చేసుకున్నారు. అయితే గత రెండ్రోజులుగా రాయచోటి పోలీసుల అదుపులో ఉగ్రవాదుల భార్యలు ఉన్నట్లు తెలుస్తుంది.
దక్షిణాది రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో అబుబక్కర్ సిద్ధిఖీ, మహమ్మద్ అలీ బాంబు పేలుళ్లకు పాల్పడినట్లు కూడా అధరాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే మహమ్మద్ అలీ స్థానికంగా కిరాణా షాప్ నడుపుతూ, అబుబక్కర్ సిద్ధిఖీ బట్టల దుకాణం నిర్వహిస్తూ పేలుళ్ళకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ఇద్దరు ఉగ్రవాదులు కూడా మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నారు. వీరికి రాయచోటి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించగా, కడప సెంట్రల్ జైలు కు పోలీసులు తరలించనున్నారు.
మరోవైపు బట్టల వ్యాపారం పేరుతో సాధారణ జీవితం గడుపుతున్న వీరికి ఉగ్రవావాద కార్యకలాపాలతో సంబంధం ఉందని తెలియడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. అలాగే వీరిని అరెస్ట్ చేయడానికి తమిళనాడు నుంచి వచ్చిన పోలీసులు అదుపులోకి తీసుకోవడం స్థానికంగా కూడా చర్చనీయాంశమైంది.