
- క్లాస్‌లో హిజాబ్‌లు వద్దన్న కాలేజ్
- పోటాపోటీగా రెండు వర్గాల స్టూడెంట్ల నిరసనలు
ఉడుపి: కర్నాటక ఉడుపి జిల్లాలోని రెండు కాలేజీల్లో హిజాబ్(తల చుట్టూ కప్పుకునే వస్త్రం)లు, కాషాయ కండువాలపై లొల్లి కొనసాగుతోంది. హిజాబ్ లు ధరించి క్లాసులకు హాజరయ్యేందుకు అనుమతించకపోవడంపై కొన్ని రోజులుగా ముస్లిం గర్ల్ స్టూడెంట్లు నిరసనలు తెలుపుతుండగా.. తాజాగా శనివారం సరస్వతి పూజ(బసంత్ పంచమి) సందర్భంగా హిందూ స్టూడెంట్లు యూనిఫారం ధరించి మెడలో కాషాయ కండువాలు వేసుకుని, జైశ్రీరాం అని స్లోగన్స్ చేసుకుంటూ కాలేజీకి వచ్చారు. కాలేజ్ గేటు వద్ద రెండు వర్గాల స్టూడెంట్లు నిరసనలు తెలుపుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. మరోవైపు కాలేజీ వద్ద పోలీసులు సెక్యూరిటీని ఎక్కువ చేశారు. ఈ వివాదంపై దేశవ్యాప్తంగా చర్చలు మొదలవగా, బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటలయుద్ధం తీవ్రమైంది.
హిజాబ్‌లు, కండువాలు.. ఏవీ వద్దు: హోంమంత్రి
స్కూల్స్, కాలేజీల్లోకి అటు హిజాబ్‌లు కానీ, ఇటు కాషాయ కండువాలు కానీ ఏవీ ధరించి రావద్దని కర్నాటక హోం మినిస్టర్ అరగ జ్ఞానేంద్ర స్పష్టం చేశారు. ‘‘బడుల్లో అన్ని మతాల స్టూడెంట్లు ఉంటారు. పిల్లలు తామంతా ఒకటేనని, భరత మాత బిడ్డలం అని అనుకోవాలి. కానీ తాము వేర్వేరు అనే భావన వారికి రాకూడదు. అయితే కొన్ని మతపరమైన సంస్థలు దీనికి విరుద్ధంగా ఆలోచిస్తున్నాయి” అని మంత్రి మీడియాతో వెల్లడించారు.
సరస్వతీ దేవి వివక్ష చూపదు: రాహుల్ గాంధీ
హిజాబ్‌లు ధరించి క్లాస్ రూంలలోకి రావద్దంటూ కాలేజీ అథారిటీస్ ఆదేశించడాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తప్పుపట్టారు. ‘‘హిజాబ్‌ల కారణంగా స్టూడెంట్లను కాలేజీకి రానివ్వకుండా.. మనం ఇండియా డాటర్ల భవిష్యత్తును దోచుకుంటున్నాం. సరస్వతి మాత అందరికీ సమానంగా నాలెడ్జ్ ఇస్తుంది. మతం కారణంగా ఎవరి పట్లా వివక్ష చూపదు” అని రాహుల్ ట్వీట్ చేశారు.
హిజాబ్‌లను తప్పనిసరి చేస్తారా?: బీజేపీ
రాహుల్ గాంధీ ట్వీట్‌పై కర్నాటక బీజేపీ మండిపడింది. ఆయన ఎడ్యుకేషన్‌కు మతం రంగు పులుముతున్నారని విమర్శించింది. ‘హిజాబ్ తప్పనిసరి అని భావిస్తే.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో దీనిని ఎందుకు తప్పనిసరిగా చేయలేదు?” అని ట్వీట్ చేసింది.